సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ పోలీసుల వేధింపుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ వీధి వ్యాపారులంతా జీహెచ్ఎంసీ కార్యాలయంలో సోమవారం ఉదయం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నేషనల్ హాకర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దాదాపు నాలుగు గంటల పాటు నగరం నలుమూలల నుంచి తరలివచ్చి నిరసన ప్రదర్శన చేపట్టారు. సొంతంగా చిరు వ్యాపారం చేసుకుంటున్న తమపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనోపాధి పొందామని, ఈ ప్రభుత్వంలో తాము బతకలేని పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రోజూ పని చేసుకుంటూ రూ.500, రూ.1000 వచ్చే షాపులకు వేలకు వేలు ఫైన్లు వేస్తుండటం ఎంత వరకు సమంజసమని ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీర్ ఇనాయత్ అలీ బాక్రీ ప్రశ్నించారు. ఆపరేషన్ రోప్ పేరుతో ట్రాఫిక్ పోలీసుల వేధింపులు అన్నీ ఇన్నీ కావని, ఆక్రమణల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్కింగ్ లేని బడా హోటళ్ల జోలికి వెళ్లకుండా చిన్న వ్యాపారస్తులను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. పెట్టి కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, జీహెచ్ఎంసీ గుర్తింపు కార్డులు ఇచ్చినప్పటికీ తమకు జీవనోపాధి లేకుండా పోతున్నదని వాపోయారు. స్ట్రీట్ వెండర్ చట్టాలను ఆమలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీధి వ్యాపారుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి పీఎం సురక్ష భీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన, శ్రమయోగి మందన్ పింఛన్ యోజన, మాతృవందన యోజన, జననీ సురక్షణ యోజన, జన్‌ధన్ యోజన, వన్ నేషన్ వన్ కార్డు తదితర పథకాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా అమీర్‌పేట, సికింద్రాబాద్, కోఠి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వీధి వ్యాపారులంతా ప్రజావాణి వేదికకు వెళ్లి అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్‌కు వినతి పత్రం సమర్పించారు.