సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మొన్న రాజేంద్రనగర్…నిన్న ఉప్పల్లో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపర్చాయి. ఇలా వరుస సంఘటనలు చిన్నారుల తల్లిదండ్రులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది..చిన్నారులను మొదలుకొని మహిళలు, వృద్థుల వరకు ఎవరినీ వదలడం లేదు. బయట మనిషి కనబడితే చాలు కరిచి పడేస్తున్నాయి.. పగబట్టినట్లే ప్రవరిస్తూ కండలు పీకేస్తూ ప్రాణాలను తీస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట జనాలు కుక్క కాటుకు బలవుతున్న పరిస్థితి. వందలాది మందిని దవాఖానలకు గురి చేస్తున్నాయి.
నారాయణగూడలోని ఐపీఎం (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్)కు కుక్క కాట్లతో దాదాపు 100 మందికి పైగా బాధితులు క్యూ కడుతున్నారంటే కుక్కల బెడద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక జీహెచ్ఎంసీ వీధి కుక్కల నియంత్రణను గాలికి వదిలేసింది. తూతూ మంత్రంగా నియంత్రణ చర్యలు చేపడుతున్నది. ప్రధానంగా వీధి కుక్కలకు ఏబీసీ (యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్) ఆపరేషన్లేగాక, రేబిస్ నివారణ టీకాలను వేయడంలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వహిస్తోంది. ఏబీసీ ఆపరేషన్లు పెంచేందుకు మూడు జోన్లలో జంతు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు విషయంలోనూ ఆలసత్వం ప్రదర్శిస్తున్నారు.
ప్రధానంగా రాబోయే వేసవిలో ఒక పక్క ఎండవేడి, మరోపక్క చెత్త వ్యర్థాల డంపింగ్ వద్ద నిల్వ ఉన్న వ్యర్థాలను తినడం వల్లే కుక్కల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుని, కనిపించిన వారిపై పిచ్చికోపంతో దాడులకు తెగబడే అవకాశాలు లేకపోలేదు. సహజంగా ఎండాకాలంలో తాగునీటి వసతి తక్కువగా ఉండడంతో వేడి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వీధి కుక్కల్లో ప్రకోపనం (ఇరిటేషన్) అధికంగా ఉంటుంది. వీధి కుక్కలకు సంతాపన నిరోధక శస్త్ర చికిత్సలు, వ్యాక్సీన్లు చేశామని చెబుతున్నా..పెరుగుతున్న వరుస కుక్క కాట్లు అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో 3.79 లక్షల వీధి కుక్కలుండగా.. వీటిలో 77 శాతం కుక్కలకు మాత్రమే స్టెరిలైజేషన్ చేస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.. కుక్కల నియంత్రకు ‘కంట్రోల్ ఆఫ్ స్ట్రే యానిమల్స్’ హెడ్ పేరుతో ప్రతి ఏడాది నిధులు కేటాయిస్తున్నారు. స్టెరిలైజేషన్స్, వ్యాక్సినేషన్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇతర జంతువుల సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు మూడేండ్లలో రూ.29.67కోట్లు ఖర్చు చేశారు. యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ), యాంటీ రేబిస్(ఏఆర్) కార్యక్రమాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయినా 70 శాతం కుక్కలకు ఆపరేషన్లు కూడా చేయలేదని అధికారిక లెక్కలు చెబుతుండటం గమనార్హం.
ప్రమాదకరమైన, దీర్ఘకాలికంగా రోగాలబారిన కుక్కలను నియంత్రించేందుకు ఉన్న చట్టాలను పట్టించుకోలేదనే విమర్శలూ లేకపోలేదు. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఎంతో మంది చిన్నారులు కుక్కల దాడుల్లో మరణించారు. ఈ క్రమంలోనే 2023లో అంబర్ పేట నాలుగేండ్ల బాలుని కుక్కల పీక్కుతున్న సంఘటను హైకోర్టు సుమోటగా స్వీకరించింది. ఈ కేసు నేపథ్యంలో కుక్కల నియంత్రణ ఖర్చు వివరాలు, ప్రమాదకరమైన కుక్కలను చంపడానికి అనుమతివ్వాలని హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్ఎంసీ కొత్త పంథాను ఎంచుకుంది. 1960 ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ యాక్ట్ 1960లోని సెక్షన్ 11(3)(బీ), 11(3)(సీ), జీహెచ్ఎంసీ 1955 చట్టంలోని సెక్షన్ 249 ప్రకారం ప్రమాదకరమైన, దీర్ఘాకాలిక రోగాల బారిన పడిన కుక్కలను యూథానేసియా(మెర్సీ కిల్లింగ్) ద్వారా (కుక్కలకు స్టెరిలైజేషన్ సమయంలో మత్తు ఇంజెక్షన్లను ఎక్కువ మోతాదులో ఇచ్చి చంపడం) చంపడానికి అనుమతివ్వాలని జీహెచ్ఎంసీ హైకోర్టును కోరింది. అయితే దీనిపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటనేది వేచి చూడాల్సిందే. ఒకవేళ మెర్సీ కిల్లింగ్కి హైకోర్టు అనుమతిస్తే యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారమే ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. 2008లో బాంబే హైకోర్టు, 2015లో కేరళ హైకోర్టులు కుక్కలను మెర్సీ కిల్లింగ్కి అనుమతిచ్చాయి. ఈ అంశాన్ని సవాల్ చేస్తూ యానిమల్ యాక్టివిస్టులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. కేంద్ర పశుసంవర్ధక శాఖ కూడా 2022లో తెచ్చిన యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ లో మెర్సీ కిల్లింగ్ను సమర్థించింది.
కుక్కల నియంత్రణలో భాగంగా స్టెరిలైజేషన్, యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలను నిర్వహించే యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్(ఏడబ్ల్యూవో)లకు జీహెచ్ఎంసీ నుంచి ఆర్థికంగాను, లాజిస్టికల్ గాను చేయూతనందిస్తున్నది. ఐదు సంస్థలకు కుక్కల ఆపరేషన్లు, ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు ఐదేండ్లలో రూ.9.18కోట్లు ఖర్చు చేశారు.