దుండిగల్, అక్టోబర్ 2: దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో వీధికుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. ఇంటి సమీపంలోని కిరాణా షాపులో పాలపాకెట్ కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఏడేండ్ల బాలుడిపై ఓ వీధికుక్క దాడిచేసి తీవ్రంగా గాయపర్చింది. వివరాల్లోకి వెళితే.. బౌరంపేట గ్రామపంచాయతి సమీపంలో జేమ్స్ ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. బుధవారం ఉదయం పాల పాకెట్ తీసుకురమ్మని జేమ్స్ తన ఏడేండ్ల కుమారుడైన జశ్వంత్‌ను కిరాణా దుకాణానికి పంపించాడు.
జశ్వంత్ పాల పాకెట్ తీసుకుని.. ఇంటికి వస్తుండగా అక్కడే ఉన్న ఓ వీధి కుక్క అతడిపై దాడి చేసింది. జశ్వంత్ తొడను (పీకడం) కరవడంతో తీవ్ర గాయమైంది. గమనించిన స్థానికులు కుక్కను అక్కడి నుంచి తరిమేసి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వెంటనే బాలుడిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ క్లీనిక్‌లో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం నారాయణగూడలోని ప్రత్యేక వైద్యశాలకు తరలించారు. అయితే, బౌరంపేటలో ఇటీవల వీధి కుక్కల బెడద అధికమైందని, వాటి నుంచి తమకు రక్షణ కల్పించాలని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపానపోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా కుక్కల బెడదను నివారించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన తెలిసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ కె.సత్యనారాయణ రావు స్పందించారు.
బ్లూ క్రాస్ సొసైటీ ప్రతినిధులను పిలిపించి.. ఆ ఏరియాలో ఉన్న కుక్కలను దగ్గరుండి పట్టించారు. కుక్కలకు పిల్లలు పుట్టకుండా స్టైర్లెజేషన్ చేయడం జరుగుతుందని, యాంటీ రేబిస్ టీకా కూడా వేయిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కలు ఎక్కడున్నా వెంటనే మున్సిపాలిటీ ఫోన్ నంబర్ 9542715377, 903009539కు కాల్ చేసి సమాచారమివ్వాలన్నారు. కుక్క కరిచిన బాబుని మున్సిపల్ కమిషనర్ పరామర్శించారు. ప్రస్తుతం అన్ని స్కూళ్లల్లో పిల్లలకు వీధి కుక్కలపైన అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.