
సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో వంద శాతం మురుగును శుద్ధి చేయడమే లక్ష్యంగా సుమారు రూ.3,800 కోట్లతో చేపడుతున్న 31కొత్త ఎస్టీపీల (సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల ) నిర్మాణాన్ని దసరా లోపు పూర్తి చేయాలని, ఇందుకు తగ్గట్టు ప్రణాళికా బద్ధంగా పనులు చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ పేరొన్నారు. అంబర్‌పేటలోని జలమండలి ఎస్టీపీ ప్రాంగణంలో ఎండీ శుక్రవారం జలమండలి ఎస్టీపీ విభాగం ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే అనుమతులు లభించిన స్థలాల్లో సాయిల్ టెస్టులు పూర్తి చేసి వెంటనే ఎస్టీపీ నిర్మాణ పనులు ప్రారంభించాలని ఎండీ అధికారులను ఆదేశించారు. భూమికి సంబంధించిన సమస్యలు ఉన్న ప్రాంతాల్లో త్వరగా సమస్యలు పరిషరించుకొని, అనుమతులు తెచ్చుకునేలా అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించారు. ప్రతీ ఎస్టీపీకి సంబంధించి ఏ రోజుకు ఆ రోజు చేయాల్సిన పనులపై చెక్ లిస్టు రూపొందించుకోవాలన్నారు. కచ్చితంగా ఆ రోజు పనులు పూర్తి చేయాలన్నారు. ఆ చెక్ లిస్టు వివరాలు జలమండలి అధికారుల వద్ద, సైట్ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధుల వద్ద అందుబాటులో ఉండాలన్నారు.
ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలి..
అన్ని ఎస్టీపీల ప్లాన్లను సాధ్యమైనంత త్వరగా రూపొందించి వేగంగా పనులు మొదలుపెట్టడానికి ప్రణాళికలు రూపొందించాలని ఎండీ ఆదేశించారు. ప్రతి ఎస్టీపీకి సంబంధించి పూర్తి ప్రాజెక్టు వివరాలు, వర్ షెడ్యూళ్లను రూపొందించుకొని ఆ ప్రకారం ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టి, దసరా వరకు ఎస్టీపీలను పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు సూచించారు. మొదటి దశ ఈ ఏప్రిల్‌లోపు సివిల్ వరులు పూర్తి చేయాలని, అప్పుడే దసరా వరకు ఎస్టీపీలను పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా పనులు జరిగేలా చూడాలన్నారు. ఏక కాలంలో ఎస్బీఆర్ (సీక్వెన్షల్ బ్యాచ్ రియాక్టర్), సీసీటీ (క్లోరిన్ కాంటాక్ట్ ట్యాంక్ ), తదితర పనులను చేపట్టాలన్నారు. అన్ని ఎస్టీపీలు సెప్టెంబర్‌లో ట్రయల్ రన్ చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు.
రక్షణ చర్యలు తప్పనిసరి..
ఎస్టీపీల నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జల మండలి ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలని పేరొన్నారు. 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో పనులు చేయించాలని, ఇందుకు తగినట్లుగా కార్మికులు, నిర్మాణ సామగ్రి, యంత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎస్టీపీ ప్రాంగణంలో మూడు షిఫ్టుల్లో సైట్ ఇంజినీర్లు కచ్చితంగా పనులను పర్యవేక్షించాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. ఎస్టీపీ నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న కార్మికులు అన్ని రక్షణ చర్యలు పాటించేలా చూడాలని సూచించారు. రాత్రి వేళల్లో పనులు జరుగుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సరిపడా వెలుతురు ఉండేలా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, సైట్ ఇంజినీర్లు పాల్గొన్నారు.