బడంగ్‌పేట, ఆగస్టు 21: బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనులు పూర్తికాకుండానే అసంపూర్తి భవనాలకు శిలాఫలకాలు పెట్టి మంత్రుల చేత ప్రారంభోత్సవాలు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు, ఎంబీ రికార్డులు చేస్తున్న అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్ లేకుండానే పనులు చేపట్టడం, పనులను పరిశీలించకుండానే బిల్లులు ఇవ్వడం వంటి వాటిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో రూ.25 లక్షలతో మహిళా శక్తి క్యాంటీన్ భవనం నిర్మాణం పూర్తిచేసిన్నట్లు ప్రారంభోత్సవాలు చేశారు.
24-1-2025 తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేస్తున్నట్లు శిలాఫలకంపై రాసి పెట్టారు. అయితే రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదగా ఆ భవనాన్ని ప్రారంభించారు. వాస్తవానికి ఆ భవన నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు.మంత్రి కూడా భవనం పూర్తి అయ్యిందా లేదా అనే విషయాన్ని పరిశీలించకుండానే ప్రారంభోత్సవం చేశారు. అయితే రూ.25 లక్షలు పెట్టి నిర్మాణం చేసిన భవనం అసాంఘీక కార్యకాలపాలకు అడ్డగా మారిందని స్థానికులు వాపోతున్నారు.
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో నిర్మాణం చేసిన మహిళా శక్తి క్యాంటీన్ భవన నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అధికారులకు ఒక అంచనా లేదు. పనులు ఎలా చేశారో పరిశీలించకుండానే బిల్లులు మాత్రం ఇచ్చేశారు. అధికారులు అందరు నిత్యం అదే భవనం నుంచి పోతున్పటికీ అసంపూర్తిగా ఉన్న ఆ భవనం పూర్తిచేయాలన్న ఆలోచన అధికారులకు లేదు.
పనులు అయినా కాకున్నా బిల్లులు ఎత్తించడం అనవాయితీగా పెట్టుకున్నారు. ప్రజా ధనం దుర్వినియోగం అవుతున్నా, పారదర్శకత లోపించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఆ భవనం నిర్మానుష్యంగా ఉండటంతో మరోసారి భవనానికి బిల్లులు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రజాధనం వృథాను అరికట్టాల్సిన అవసరం ఉంది.