సిటీబ్యూరో/మియాపూర్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. పేద ప్రజలు హెచ్ఎండీఏ భూములను ఆక్రమించేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. మియాపూర్లో హెచ్ఎండీఏకు ప్రభుత్వ కేటాయించిన సర్వే నంబర్ 100,101లలో సుమారు 450 ఎకరాల దాకా స్థలం ఉన్నది. దాన్ని ఎప్పటి నుంచో కబ్జా చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నా.. హెచ్ఎండీఏ అడ్డుకుంటోంది. ఈ భూముల్లో పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తున్నారంటూ ప్రచారం జరగటంతో నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
శుక్రవారం నుంచే వేలాది మంది హెచ్ఎండీఏ ఆధీనంలో ఉన్న భూముల్లోకి వచ్చి తమకు స్థలాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. భూములను ఆక్రమిస్తున్నారని ఆలస్యంగా తెలుసుకున్న హెచ్ఎండీఏ అధికారులు.. స్థానిక పోలీసులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ స్థలాన్ని వదిలేసి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పినా.. వినకుండా అక్కడే ప్రజలు కూర్చిండిపోయారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినా..కదలలేదు. పైగా రాళ్లతో దాడి చేయడంతో పోలీసులు తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. పెద్ద ఎత్తున మొహరించిన పోలీసు బలగాలు అక్కడి నుంచి ప్రజలను పంపించేందుకు ప్రయత్నం చేసినా, వారి నుంచి ఎదురు దాడి ఎదురైంది.
-హెచ్ఎండీఏ ఎస్టేట్ ఆఫీసర్ శివారెడ్డి
మియాపూర్లోని సర్వే నంబర్ 100,101లలో హెచ్ఎండీఏకు సుమారు 450 ఎకరాల దాకా భూమి ఉన్నది. ఇందులో గతంలో ఇంటర్సిటీ బస్ టర్మినల్ కోసం 100 ఎకరాలను కేటాయించి, ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ప్రస్తుతం రెండు సర్వే నంబర్లలో ఉన్న భూములపై సుప్రీం కోర్టులో స్టే ఉండడంతో అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదు.
ఎవరైనా ఆక్రమించి నిర్మాణాలు చేస్తే కూల్చివేయిస్తున్నాం. రెండు రోజులుగా పేద ప్రజలు స్థలాలు ఇవ్వాలంటూ హెచ్ఎండీఏ ఆధీనంలో ఉన్న స్థలంలో వేల సంఖ్యలో వచ్చారు. వారందరికీ ఆ భూమికి సంబంధించిన వివరాలను తెలియజేశాం. పట్టాలు గానీ, ఇండ్ల స్థలాలు ఇవ్వడం లేదని చెప్పాం. అయినా వారు అక్కడి నుంచి వెళ్లడం లేదు. హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీఎస్పీ, సీఐతో పాటు ప్రత్యేక పోలీసు సిబ్బంది స్థలంలోనే ఉండి వారు గుడిసెలు వేసి ఆక్రమించుకోకుండా అడ్డుకుంటున్నాం.
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు ఉంటాయి. హెచ్ఎండీఏ స్థలంలోకి వచ్చిన వారికి పోలీసులు ఎంతో ప్రశాంతంగా స్థలాన్ని విడిచివెళ్లిపోవాలని చెప్పారు. అది విని కొందరు వెళ్లిపోయారు. అయినా ఇంకా చాలా మంది స్థలంలో ఉండి మాకు స్థలాలు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.