FTP | సిటీబ్యూరో: వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్‌ను నిలుపాలన్న గత కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం నెరవేరనున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పురుడుపోసుకున్న ప్రతిపాదనల్లో మరో అద్భుతమైన భారీ మురుగునీటి ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే రోజూ ఉత్పన్నమయ్యే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేయడానికి వీలుగా రూ. 3866.41 కోట్ల వ్యయంతో 1259.50 ఎంఎల్డీ సామర్థ్యంతో 31 కొత్త ఎస్టీపీలను చేపట్టి..ఏడు చోట్ల వినియోగంలోకి తెచ్చారు.
దుర్గం చెరువు, కోకాపేట ఎస్టీపీలు అందుబాటులోకి రాగా, కాంగ్రెస్ సర్కారు మిరాలం, పెద్ద చెరువు, నల్లచెరువు ఎస్టీపీలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే మియాపూర్ పటేల్ చెరువు, సఫిల్‌గూడ, ఖాజాగూడ ఫత్తేనగర్, వెన్నెల గడ్డ, నాగోల్ ఎస్టీపీల ట్రయల్ రన్ జరుగుతోంది. త్వరలోనే వీటిని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే రూ. 3784 కోట్ల అంచనా వ్యయంతో 965 ఎంఎల్డీల సామర్థ్యంతో మరో 39 ఎస్టీపీల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు.
అమృత్ పథకం కింద కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 39 ఎస్టీపీల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు మొత్తంలో 25 శాతం కేంద్రం, 35 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా, 40 శాతం సంబంధిత ఏజెన్సీ వాటా చొప్పున హెచ్ఏఎం మోడ్‌లో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ ప్రాజెక్టుకు త్వరలోనే పరిపాలన అనుమతులు లభించనున్నాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. 39 ఎస్టీపీల్లో దాదాపు 20 చోట్ల భూ సేకరణ సమస్య లేదని, మిగిలిన చోట కలెక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టు పనులకు టెండర్లను ఆహ్వానించి పనులు చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.