చర్లపల్లి, జూన్ 28: చర్లపల్లి కేంద్ర కారాగారం పరిసర కాలనీలలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని భగవాన్ కాలనీ, రెడ్డి కాలనీ, కృష్ణనగర్, ఎంఆర్ఆర్ కాలనీలకు చెందిన కాలనీ సంక్షేమ సంఘాల నాయకులతో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్యమిశ్రాను కలిసి సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర కారాగరం ఉండటంతో పరిసర కాలనీల నుంచి డ్రైనేజీ, వర్షం నీరు బయటకు వెళ్లలేక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జైళ్లశాఖ డీజీ దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని సౌమ్య మిశ్రా తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సినీయర్ నాయకుడు నేమూరి మహేష్ గౌడ్, జైలు అధికారులు, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు భూమిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, జీవన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, వెలమరెడ్డి, అమరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.