సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): యుద్ధానికి ముందే సన్నాహక ప్రణాళికలు ఉంటాయి. కానీ కాంగ్రెస్ పాలనలో యుద్ధం మొదలైందని ప్రకటించిన తర్వాత సరంజామాను ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. ఇది ఇప్పటినుంచి మొదలైందని అనుకుంటే పొరపాటే. మున్సిపాలిటీలను గ్రేటర్లో కలిపిన సమయంలోనూ ఇదే తీరుగా వ్యవహరించింది. అడ్డగోలు ప్రకటనలతో, ప్రచార ఆర్భాటాల కోసం ఎలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండానే బల్దియాలో విలీనం చేస్తూ వైఎస్ఆర్ సర్కార్ జీవోలు జారీచేసి గ్రేటర్ పరిధి పెరిగిందంటూ ఆగమాగం చేసింది.
రియల్ ఎస్టేట్ డిమాండ్ కోసం ప్రభుత్వ, సొంత భూముల ధరలు పెంచుకునేందుకు అప్పట్లో గ్రేటర్లో కలిపిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడున్న రేవంత్ సర్కార్ కూడా ముందస్తు ప్రణాళికలు లేకుండానే ‘గుడ్డెద్దు చేనులో పడినట్లు’గా ఒంటిగా పోతుంది. ట్రిపులార్ వరకు భూములకు డిమాండ్ తీసుకురావాలనే లక్ష్యంతో హెచ్ఎండీఏ పరిధిని విస్తరించిన సర్కార్… తాపీగా ఇప్పుడేలా విభజన చేయాలని తెలుసుకోవడానికి ఏజెన్సీలను నియమించుకుంటోంది. నిజానికి ఇవన్నీ కూడా ముందే అధ్యయనం చేయాలి. కానీ హెచ్ఎండీఏ పరిధిని విస్తరించిన మూడున్నర నెలలకు ఎలా విభజన చేయాలనే విషయంపై దృష్టి పెట్టింది.
7 జిల్లాల నుంచి 11 జిల్లాలకు..
ఏడు జిల్లాల నుంచి 11జిల్లాలకు విస్తరిస్తూ హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పని విభజన, జోన్ల ఏర్పాట్లు, కొత్త విభాగాల ఏర్పాటు వంటి అంశాలను ఖరారు చేసేందుకు తాజాగా హెచ్ఎండీఏ కమిషనర్ టెండర్లను ఆహ్వానించారు. నియామక ఏజెన్సీ హెచ్ఎండీఏలో కొత్త జోన్ల ప్రతిపాదన, జోనల్ కమిషనర్ల విధులు, ప్లానింగ్ పాలసీ విధానాలతోపాటుగా, కొత్తగా ప్రాజెక్టు మేనేజ్మెంట్ వంటి విభాగాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రణాళికలను తీర్చిదిద్దాల్సి ఉంటుంది.
నిజానికి ఈ వ్యవహారాలపై ముందుగానే అధ్యయనం చేసిన తర్వాత పరిధి విస్తరణ అంశాలపై అధికారికంగా ప్రకటించాలి. కానీ జీవో జారీచేసిన మూడున్నర నెలల తర్వాత కొత్తగా ఏజెన్సీని నియమించుకోవడం ఎందుకనీ హెచ్ఎండీఏ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు 7 జిల్లాల వారీగానే అన్ని విభాగాలు పనిచేయగా.. కొత్తగా వచ్చిన నాలుగు జిల్లాల కోసం ఏజెన్సీ ద్వారా అధ్యయనం చేయాల్సినంత అవసరం ఏం ఉందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. నియమించుకునే ఏజెన్సీ మూడున్నర నెలల్లోగా హెచ్ఎండీఏ వికేంద్రీకరణ రూట్ మ్యాప్‌ను ఖరారు చేయాల్సి ఉండగా… ఎందుకు హెచ్ఎండీఏ ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పలువురు సీనియర్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.