దుండిగల్, మే20: జోమాటో డెలివరీ బాయ్స్ మాటున ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను బాచుపల్లి పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి రూ.10లక్షల విలువచేసే పది ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుల్లో ఇద్దరిని రిమాండ్‌కు తరలించగా మరో ఇద్దరు బాలనేరస్థులను జువైనల్ హోంకు తరలించారు. కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలగంగిరెడ్డి కథనం ప్రకారం… మెదక్ జిల్లా, వెల్దుర్తి మండలం, మానేపల్లి గ్రామానికి చెందిన దాసరి సురేశ్ అలియాస్ సూరి(19), దాసరి మహుశ్ (20) నగరానికి వలసవచ్చి అల్వాల్‌లోని వడ్డెరబస్తీలో నివాసముంటున్నా డు.
సురేశ్ జోమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తుండగా, మహేశ్ లారీ క్లీనర్ (హెల్పర్)గా పనిచేస్తున్నాడు. అయితే ఆదాయం అంతంత మాత్రంగానే ఉండటం, మద్యం, ఇతర జల్సాలకు డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నా రు. గ్రామానికే చెందిన ఇద్దరు మైనర్లతో కలిసి జట్టుగా ఏర్పడి పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలను దొంగిలించాలని నిర్ణయించుకున్నారు. ఇలా ఇప్పటివరకు బాచుపల్లి పీఎస్ పరిధిలో-2, పేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలో-3, దుండిగల్, జీడిమెట్ల, అల్వాల్, కూకట్పల్లి పీఎస్ పరిధుల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 10 బైకులను దొంగిలించారు.
బైక్ దొంగతనాలు ఇటీవల పెరిగిపోతుండటంతో బాచుపల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం బాచుపల్లి రాజీవ్‌గాంధీ నగర్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా దాసరి సురేశ్ అనుమానాస్పదంగా వ్యవహరించడంతో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు నేరాలను అంగీకరించాడు.
అతనిచ్చిన సమాచారంతో మహేశ్‌తోపాటు మరో ఇద్దరు బాల నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సురేశ్, మహేశ్‌లను రిమాండ్‌కు తరలించిన పోలీసులు బాలనేరస్థులను జువైనల్ హోంకు తరలించారు. నిందితుల నుండి రూ.10లక్షల విలువచేసే 10 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో బాచుపల్లి సీఐ సతీష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.