సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): గ్రామ స్థాయి ప్రజల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడం, దాన్ని ఉపయోగించి సమస్యలకు పరిషారాలు కనుగొనడంపై వినూత్న కార్యక్రమానికి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) శ్రీకారం చుట్టింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా టీ-ఇన్నోవేషన్ మహోత్సవం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 21ని యూనైటెడ్ నేషన్స్ ప్రపంచ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డేగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఐసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
స్టెప్ అవుట్ అండ్ ఇన్నోవేట్ అనే థీమ్‌తో అవర్ ఫర్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ స్థాయిలో, పంచాయతీ రాజ్ శాఖ సహకారంతో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో నిర్వహించారు. అదేవిధంగా కళాశాలలోని విద్యార్థుల కోసం ఇతర భాగస్వాములతో కలిసి టీఎస్ఐసీ సంయుక్తంగా కళాశాలల్లో అవర్ ఫర్ ఇన్నోవేషన్ అనే వెబినార్‌ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ సగటు మనిషికి సరికొత్త ఆవిష్కరణలపై అవగాహన కల్పించే దిశగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్నదన్నారు.
ఆవిష్కరణల పరంగా తెలంగాణ రాష్ట్రం ఎన్నో మైలు రాళ్లను సాధించిందని చెప్పారు. టీఎస్ఐసీ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంతా తౌటం మాట్లాడుతూ గ్రామీణ స్థాయి ప్రజల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారి సమస్యలకు పరిషారం వెతకడమే ఈ అవర్ ఫర్ ఇన్నోవేషన్ కార్యక్రమం లక్ష్యమన్నారు. గ్రామ స్థాయిలో ఇన్నోవేషన్ వ్యవస్థ గురించి తెలిపేందుకే ఇది ఒక ప్రయత్నమన్నారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, యూత్ హబ్ (వై హబ్), ఇంక్వి-ల్యాబ్ ఫౌండేషన్ సంయుక్తంగా కళాశాల విద్యార్థుల కోసం వెబినార్‌ను నిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల్లో ఈ కార్యక్రమం నిర్వహించామని, విద్యార్థుల్లోనూ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ ప్రాముఖ్యత గురించి వివరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని, సుమారు 3000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆమె తెలిపారు.