హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సుమారు ఐదు లక్షల టన్నుల ధాన్యం తడిసి పాడైనట్టు పౌరసరఫరాల శాఖ ప్రాథమిక అంచనా వేసింది. నివేదికను ఆయా జిల్లాల నుంచి సేకరించింది. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్‌రైస్‌గా మార్చాలని నిర్ణయించింది.
వాస్తవానికి తడిసిన ధాన్యం రా రైస్‌కు పని చేయదు. కేంద్రం కూడా సాధారణ బాయిల్డ్ రైస్‌కు బదులుగా కొంత మేర ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ తీసుకొనేందుకు ఇప్పటికే అనుమతిచ్చింది. గత యాసంగికి సంబంధించిన తడిసిన ధాన్యంతోపాటు మరికొంత కలిపి 7.35 లక్షల టన్నుల ధాన్యాన్ని (5లక్షల టన్నుల రైస్) ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్‌గా మార్చాలని మిల్లర్లకు ఆదేశాలు జారీ చేసింది.
గత యాసంగికి సంబంధించి ప్రభుత్వం 50.39 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. కేంద్రం బాయిల్డ్ రైస్ స్వీకరించేది లేదని తేల్చిచెప్పింది. ఈ పరిస్థితుల్లో 20 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కేంద్రాన్ని కోరింది. దీనిపై ఇంకా కేంద్రం నుంచి అనుమతులు రాలేదు. ఇందుకు కేంద్రం అంగీకరిస్తే రాష్ట్రంపై నష్టభారం తగ్గనున్నది.