మియాపూర్ , జూలై 18 : ప్రజా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. అమలవుతున్న పథకాలు ప్రతిపక్ష పార్టీలను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నాయన్నారు. హఫీజ్‌పేట్ డివిజన్‌కు చెందిన వ్యాపార వేత్తలు అఫ్తబ్, ఇస్మాయిల్ బీఆర్ఎస్ నేత మిద్దెల మల్లారెడ్డి ఆధ్వర్యంలో విప్ గాంధీ సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు అనతి కాలంలోనే దేశం దృష్టిని ఆకర్షించాయన్నారు. ప్రజల ఆదరణతో కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలతో మూడోసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని విప్ గాంధీ పేర్కొన్నారు.
పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు. పార్టీ పటిష్టత కోసం శ్రేణులు సైనికుల్లా పని చేయాలని, అఖండ విజయం సాధించేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ వృద్ధి కోసం పనిచేసే శ్రేణులకు మంచి భవిష్యతు ఉంటుందన్నారు. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై విపక్ష పార్టీల నేతలు సైతం కారెక్కేందుకు క్యూ కడుతున్నారని, ఎన్నికల్లోగా వారి కార్యాలయాలు ఖాళీ అవడం ఖాయమని విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.