సిటీబ్యూరో/బన్సీలాల్‌పేట్, మార్చి17, (నమస్తే తెలంగాణ): గాంధీలో వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన జెరియాట్రిక్ వార్డు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్(డీఎంఈ) డాక్టర్ నరేంద్రకుమార్ అధికారులను ఆదేశించారు. ఇటీవల ‘నమస్తే’లో ‘వృద్ధులంటే చిన్నచూపా..?’ అనే శీర్షికన ప్రచురించిన కథనానికి ఆయన స్పందించి ఈ జెరియాట్రిక్ వార్డు ప్రారంభించి అందులో కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని గాంధీ సూపరింటెండెంట్ సీహెచ్ రాజకుమారిని ఆదేశించారు. సోమవారం డీఎంఈ నరేంద్రకుమార్ గాంధీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతీవార్డు తిరిగి రోగులకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
అత్యవసర విభాగంలోని పై కప్పు ఊడి ప్రమాదకరంగా కనిపించడంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అ తరువాత ఈఎన్టీ విభాగంలో గోడలపైన అశుభ్రతను చూసి శుభ్రం చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఐవీఎఫ్ విభాగాల్లో నెలకొన్న సమస్యలు ఆరా తీశారు. ఆస్పత్రిలో డ్రైనేజీ పైప్ లైన్ వ్యవస్థ, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, పారిశుధ్య వ్యవస్థ ప్రక్షాళన పనులు జరుగుతున్న కారణంగా రోగులకు అసౌకర్యంగా ఉందని, ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశాలు జారీ చేసినట్లు డీఎంఈ తెలిపారు.