బేగంపేట, జూలై 9: తమకు జీవనాధారం లేకుండా చేశారు.. తమ కుటుంబాలను ఆదుకోవాలని స్టాంప్ వెండర్స్, టైపిస్టులు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కోర్టు వద్ద ఫుట్‌పాత్‌పై ఎన్నో సంవత్సరాల నుంచి స్టాంప్ వెండర్స్గా, టైపిస్టులుగా జీవనం సాగిస్తున్న బాధితులు.. బుధవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టు వద్ద ఫుట్‌పాత్‌లపై పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, కానీ తమను నిర్ధాక్షిణ్యంగా ఫుట్‌పాత్‌లపై నుంచి ఖాళీ చేయించారని వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వారి జీవనాధారం లేకుండా చేస్తే వారి కుటుంబాలు వీధిన పడతాయని, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. అధైర్య పడొద్దని, తాను సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ప్రసాద్, కృష్ణ, ఉమా లక్ష్మి, క్రాంతి వనిత, భాను తదితరులు ఉన్నారు.