Screening Tests |సిటీబ్యూరో, ఏప్రిల్03.(నమస్తే తెలంగాణ): చిన్నారుల స్కీన్రింగ్ పరీక్షలకు సిబ్బంది కొరత వెంటాడుతుంది. జిల్లాలో 28 మంది పీఎంఓ(ప్రిన్సిపల్ మెడికల్ ఆప్తల్మాలజీ ఆఫీసర్) వైద్యులు అవసరముండగా కేవలం ఇద్దరు మాత్రమే ఉండటం మూలానా గడువులోగా పూర్తయ్యేనా అనే సందేహం వెంటాడుతంది. ఇదిలా ఉండగా జిల్లాలోని ఆరేళ్లలోపు చిన్నారులకు మూడు నెలల్లోగా కంటి పరీక్షలు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో సిబ్బంది కొరతతో వైద్యాధికారులు ఆలోచనలో పడ్డారు.
జిల్లాలో ఇరవై ఎనిమిది బృందాలుగా మూడు నెలల్లో ఆరేళ్లలోపు చిన్నారులకు స్కీన్రింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇందులో భాగంగా ప్రతి బృందంలో పీఎంఓ, ఏఎన్ఎం, మెడికల్ అధికారి, ఫార్మసిస్టులు ఒక్కొక్కరు చొప్పున ఉండాల్సి ఉంది. కానీ సిబ్బంది కొరత వల్ల ఇద్దరు మాత్రమే పీఎంలు ఉండగా, ప్రస్తుతం ఇతర సర్వేల మూలాన ఏఎన్ఎంల కొరత కూడా అధికంగా ఉంది.
ఆరేళ్లలోపు చిన్నారుల్లో కంటి సమస్యలను గుర్తించి ఆదిలోనే ఆ సమస్యను అంతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఆర్బీఎస్కే నిర్వహిస్తున్న ఈ స్కీన్రింగ్లో జిల్లాలోని 917 అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న చిన్నారులు పాల్గొననున్నారు. అంగన్వాడీ టీచర్ల సహకారంతో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. సోమవారం నుంచి కింగ్కోటీ, నాంపలి రెండు ప్రాంతాల్లోని సెంటర్లలో ప్రస్తుతానికి ప్రారంభించనున్నారు. ఈ కంటి పరీక్షలను జిల్లా కలెక్టర్, వైద్యాధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. చిన్నారుల్లో వచ్చే కంటి సమస్యలను గుర్తించి తీవ్రతను బట్టి తదుపరి చికిత్సనందించనున్నారు.