Bagh Amberpet | అంబర్‌పేట, జూన్ 7: హైదరాబాద్ బాగ్‌అంబర్‌పేట డివిజన్ శ్రీనివాసనగర్ కాలనీవాసులు ఏడాదిన్నర నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ఏదో ఒక అభివృద్ధి పని పేరుతో కాలనీలో తవ్వకాలు జరుపుతుండటంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తి నరకం అనుభవిస్తున్నారు. దీనిపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పడు చూడు ఏదో పని మీద తమ కాలనీలో తవ్వకాలు జరుపుతున్నారని వాపోతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీనివాసనగర్ కాలనీలో జీహెచ్ఎంసీ ఇం.నెం. 2-2-654 నుంచి 2-2-677 వరకు గల ఈ కాలనీలో ఏడాదిన్నర క్రితం మంచినీటి పైప్‌లైన్ వేయడానికి రోడ్డు తవ్వారు. ఆ పైప్‌లైన్ ఈ కాలనీకి కూడా కాదు. పక్కన ఉన్న పాముల బస్తీ కోసం ఈ బస్తీ నుంచి పైప్‌లైన్ తీసుకుపోతూ తవ్వారు. అప్పడు ఏకంగా 45 రోజులు తవ్వి వదిలిపెట్టారు. పైప్‌లైన్ వేసిన తర్వాత మట్టితో గుంతలను పూడ్చారు. కానీ రోడ్డుకు మరమ్మతులు చేయలేదు. అలాగే గత దీపావళి(2024) సమయంలో డ్రైనేజీ పైప్‌లైన్ వేయడానికి మళ్లీ తవ్వారు. మంచినీటికోసం ఒకపైక్కన తవ్వగా.. డ్రైనేజీ పైప్‌లైన్ కోసం రోడ్డు మధ్యలో తవ్వారు. పైప్‌లైన్ వేసిన తర్వాత అంటే దీపావళికి ఈ పనులు చేస్తే సంక్రాంతి వరకు ( జనవరి 2025 వరకు ) రోడ్డును అలాగే ఉంచారు. మట్టిపోసి గుంతలను నింపారు. కానీ మరమ్మతులు చేయలేదు. బస్తీవాసులంతా ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేస్తే అప్పడు ప్యాచ్‌వర్క్ చేశారు.
మళ్లీ మూడు నెలల క్రితం మార్చి నెలలో కొత్త రోడ్డు వేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్, వీహెచ్ తదితరులు శంకుస్థాపన చేశారు. కానీ పది రోజుల క్రితం రోడ్డును తవ్వి.. అలాగే వదిలారు. రోడ్డు వేయడం లేదు. దీంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గం ద్వారా వృద్ధులు నడవలేకపోతున్నారు. దీంతో తమకు ఇవేమీ బాధలంటూ మొత్తుకుంటున్నారు. ఏడాదిన్నర నుంచి వివిధ రకాల పనుల కోసం కాలనీ రోడ్డును తవ్వి తమను ఇబ్బందులపాలు చేస్తున్నారని వాపోతున్నారు. పది రోజుల క్రితం రోడ్డును తవ్వి ఇంకా పనులు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బాధను ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తమ బాధను పట్టించుకోని వెంటనే రోడ్డు వేసేలా చూడాలని కోరుతున్నారు.