ఉస్మానియా యూనివర్సిటీ: తార్నాక డివిజన్లోని నాగార్జున నగర్ కాలనీ పార్క్ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి (Srilatha Shoban Reddy) హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ కోదండరాం, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డిలతో కలిసి పార్కును సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్కులు ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఎంతో ముఖ్యమైనవని అన్నారు. సీనియర్ సిటిజెన్ల కోసం టాయిలెట్లు, వాకర్స్ కోసం సరైన సదుపాయాలు, అలాగే పర్యావరణ హితంగా ఉండే ఇతర వసతులు పార్కులో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ అంశంపై ఆమె వెంటనే జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్తో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు.