సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): అడుగడుగునా పోలీసు నిఘా మధ్య హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర భక్తజనం నీరాజనాల మధ్య కనులపండువగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీబందోబస్తు నిర్వహించారు. సీతారాంబాగ్ వద్ద మొదలైన శోభాయాత్ర హనుమాన్ వ్యాయామశాల వరకు ప్రశాంతంగా జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ యాత్ర బందోబస్త్‌ను నిర్వహించారు.
సుమారు 20వేల మంది పోలీసులు ఈ బందోబస్తులో విధులు నిర్వర్తించారు. ఆదివారం మధ్యాహ్నం సీతారాంబాగ్ నుంచి ప్రారంభమైన యాత్ర రాత్రి సుల్తాన్‌బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు సాగింది. ప్రధాన ఊరేగింపులు మంగళ్‌హాట్, బేగంబజార్చత్రి, సిద్దియంబర్బజార్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లీబౌలి చౌరస్తా, కోఠి ఆంధ్రబ్యాంక్ మీదుగా సుల్తాన్‌బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల వద్దకు చేరుకున్నాయి.
ఈ మొత్తం యాత్రలో శాంతిభద్రతల పరిస్థితిని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు సీపీ సీవీ ఆనంద్, ఆర్టీసీ, ఆర్అండ్బీ, జీహెచ్ఎంసీ, ఈఎంఆర్ఐ, అగ్నిమాపకశాఖ, విద్యుత్‌శాఖ, ట్రాఫిక్ పోలీసుల అధికారులతో కలిసి సీసీ కెమెరాల ద్వారా వీక్షిస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులకు సూచనలిచ్చారు. సీసీ ఫుటేజ్‌తో పాటు డ్రోన్ ఫుటేజ్‌లను చూస్తూ రేడియో కమ్యూనికేషన్ల ద్వారా వాట్సప్ గ్రూపుల ద్వారా అధికారులను అలర్ట్ చేశారు.
లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్ మాన్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్‌లతో పాటు పలువురు డీసీపీలు, ఏసీపీలు క్షేత్రస్థాయిలో ఉండి ఊరేగింపు సజావుగా సాగేలా చూశారు. ఈ యాత్ర ప్రశాంతంగా పూర్తి కావడానికి సహకరించిన వారందరికీ సీపీ సీవీ ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు.