హసన్‌పర్తి, ఆగస్టు 3: వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు సాధ్యమని సెయింట్ టెక్నాలజీస్ ఫౌండర్, చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ శివారులోని ఎస్సార్ విశ్వవిద్యాలయంలో చైర్మన్ వరదారెడ్డి అధ్యక్షతన ద్వితీయ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు.
ఇందుకు ముఖ్య అతిథిగా మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య అవగాహన ఎంతో అవసరమన్నారు. విలువలతో కూడిన సాంకేతికతతో అమెజాన్, ఆపిల్, మెక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ముందు వరుసలో నిలిచాయన్నారు. నగరంలోని యువతకు ఉద్యోగావకాశాలు పెంచాలనే ఉద్దేశంతో తన సాఫ్ట్వేర్ కంపెనీ సెయింట్ బ్రాంచ్‌ను మడికొండలో (వరంగల్) కూడా ఏర్పాటు చేశానని చెప్పారు.
చైర్మన్ వరదారెడ్డి మాట్లాడుతూ.. 2002లో తాను స్థాపించిన ఇంజినీరింగ్ కళాశాల ఎన్నో మైలురాళ్లను దాటి విశ్వవిద్యాలయం స్థాయికి చేరిందన్నారు. నాణ్యమైన విద్యను అందించడం వల్ల న్యాక్, ఏబీసీ అక్రిడిటేషన్, నిర్ఫ్(NIRF) ర్యాంకింగ్ సాధించినట్లు తెలిపారు. సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణికి ఈ సందర్భంగా డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఆయన 750కి పైగా తమిళ, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించడంతో పాటు కవి, రచయిత, దర్శకుడిగా సినిమా రంగానికి చేసిన సేవలు గుర్తించి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశామన్నారు.
ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ఉత్తీర్ణులైన ఎం.టెక్, ఎంబీఏ, బీటెక్, బీబీఏ, బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులకు పట్టాలు అందించారు. అనంతరం, తనికెళ్ల భరణి మాట్లాడుతూ, తన జీవితంలో ఈ డాక్టరేట్ ఒక మైలురాయిగా నిలిచిందని, దీనిని తన జీవిత భాగస్వామి భవానీకి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీసీ దీపక్ గార్గ్, రిజిస్ట్రార్ అర్చనారెడ్డి, కోర్ కమిటీ మెంబర్ మహేశ్, డీన్ రాందేవ్ ముఖ్ పాల్గ్గొన్నారు.