మాదాపూర్, ఆగస్టు 26: మాదాపూర్‌లోని హైటెక్స్‌లో హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మారథాన్ స్పోర్ట్స్ ఎక్స్పో’ 11వ ఎడిషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మారథాన్ ఎక్స్ పో, ఎన్ఎండీసీ సీఎండీ సుమిత్ దేబ్ విచ్చేసి ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సీఎంఓ నారాయణ, నటుడు సుశాంత్‌లతో పాటు నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మారథాన్ ఎక్స్ పో, ఎన్ఎండీసీ సీఎండీ సుమిత్ దేబ్ మాట్లాడుతూ, రోజువారి జీవనశైలిలో భాగంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేయాలని సూచించారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ప్రదర్శనలో ఫిట్నెస్ ఉత్పత్తులు, వెల్నెస్ ఉత్పత్తులతో పాటు పలు సేవల సంస్థలు పాల్గొన్నాయి.
క్రీడా మహోత్సవంలో భాగంగా మారథాన్..
ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2022లో భాగంగా ఏర్పాటు చేసిన 10కే రన్లో రిజిస్టర్ చేసుకున్న రన్నర్లకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బిబ్‌లను అందజేయగా, మిగిలిన వారికి 27వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బిబ్‌లను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 27వ తేదీ నుంచి రెండు రోజుల పాటు కొనసాగనున్న క్రీడా మహోత్సవంలో 16 వేలకు పైగా పాల్గొననున్నట్లు తెలిపారు. ఆగస్టు 27వ తేదీన కర్టెనరైజర్ 5కే రన్, 28వ తేదీన 10కే రన్, హాఫ్ మారథాన్ 21.095 కి.మీ, ఫుల్ మారథాన్ 42.195 కి.మీలతో హుస్సేన్ సాగర్ సరస్సు, రాజ్ భవన్ రోడ్డు, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ రోడ్డు నం:45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, బయో డైవర్సిటీ జంక్షన్ల మీదుగా గచ్చిబౌలి స్టేడియంలో ముగిసేలా ఏర్పాట్లు చేశారు. 10కే రన్ హైటెక్స్ గ్రౌండ్ నుంచి మొదలై ఐకియా సర్కిల్ సమీపంలోని హాఫ్, ఫుల్ మారథాన్ మార్గంలో విలీనం అయ్యేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో రాష్ట్ర పోలీసులు, పారా మిలటరీ పోలీసులు, సాయుధ దళాలు సైతం పాల్గొనేలా మారథాన్‌ను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.