సిటీబ్యూరో, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగర శివారులోని మోకిలలో ప్రముఖ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఒకటైన ఇక్ఫాయ్ హైదరాబాద్ క్యాంపస్‌లో మేనేజ్మెంట్ విద్యార్థుల క్రీడా పోటీలు ముగిశాయి. ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్ (ఐబీఎస్) హైదరాబాద్‌కు చెందిన టీమ్ వ్యాప్స్ ఆధ్వర్యంలో ఆవేగ్ 14 పేరుతో నిర్వహించిన బిజినెస్ స్కూల్స్ ఇంటర్ స్పోర్ట్స్ టోర్నమెంట్‌కు మీడియా స్పాన్సర్స్‌గా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంస్థలు వ్యవహరించాయి. మూడు రోజుల పాటు జరిగిన క్రీడోత్సవాల్లో 12 క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించారు.
దేశంలోని వివిధ నగరాల్లోని బిజినెస్ స్కూల్స్‌కు చెందిన విద్యార్థులు పాల్గొనే ఈ పోటీలకు ఎంతో ప్రాధాన్యత నెలకొన్నది. టేబుల్ టెన్నిస్‌తో విజేతగా ఉమెన్ సింగిల్ కేటగిరిలో ప్రియాంక రావత్, బ్యాడ్మింటన్‌లో మెన్స్ డబుల్స్ విన్నర్‌గా ఐబీఎస్ బెంగళూరు టీమ్, వాలీబాల్‌లో ఉమెన్స్ విభాగంలో ఐబీఎస్ హైదరాబాద్ టీం, మెన్స్ విభాగంలో ఐబీఎస్ బెంగళూరు టీమ్‌లు విజేతగా నిలిచాయి. అదేవిధంగా క్రికెట్ పోటీల్లో విజేతంగా ఐబీఎస్ బెంగళూరు, చెస్‌లో విజేతగా సాత్విక్ బులుసు (ఐఈపీ), క్యారమ్స్‌లో విజేతగా కార్తిక్ గాయరు(విజేఐఎం), రన్నరప్‌గా హితేశ్ టియోటియా(ఐబీఎస్)లు నిలిచారని ఇక్ఫాయ్ ఐబీఎస్ హైదరాబాద్ టీమ్ వ్యాప్స్ అధ్యక్షుడు మహి త్యాగి, ఉపాధ్యక్షులు భాస్కర్ యాదవ్ తెలిపారు.