సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ): నగర శివారులోని నల్సార్ యూనివర్సిటీలో విద్యార్థులు మత్తుపదార్థాల్లో మునిగితేలుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల వర్సిటీకి చెందని ఓ విద్యార్థి రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి వర్సిటీలోకి ఈగల్(ప్రత్యేక పోలీసు విభాగం) ఎంట్రీతో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం బయటకు రావడంతో.. గత ఏడాది వర్సిటీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థి విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నేపథ్యంలోనే ఈగల్ టీమ్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల కదలికలపై దృష్టి పెట్టి 20 మంది వరకు గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారని గుర్తించినట్లు సమాచారం. ఇందులో ఇద్దరికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ వచ్చిందని సమాచారం. మరికొంతమంది అనుమానితులు పరారీలో ఉన్నట్లు ఈగల్ టీమ్ గుర్తించినట్లు సమాచారం. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఈగల్ టీమ్ లేఖలు రాసినట్లు తెలిసింది.
గతేడాది సెప్టెంబర్ నెలలో యూనివర్సిటీలో ఓ 20 ఏండ్ల విద్యార్థి అనామానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే అతడి మృతి పై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఈ విషయం అప్పట్లో పెద్ద ఎత్తున్న విమర్శలకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఇటీవల సాక్షం అనే విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం.. మృతుడి జేబులో మొదట గంజాయి ప్యాకెట్ లభించడం.. ఆతర్వాత మాయం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాధారణ రోడ్డు ప్రమాద కేసుగా శామీర్‌పేట్ పోలీసులు ఈ కేసును తేలికగా తీసుకున్నారు.
అయితే డ్రగ్స్‌పై అనుమానంతో ఈగల్ పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో రోడ్డు ప్రమాద ఘటన అడ్డం తిరిగింది. రోడ్డు ప్రమాద ఘటనకు గంజాయికి సంబంధముందని ఈగల్ గుర్తించింది. దీంతో గతిలేని స్థితిలో రోడ్డు ప్రమాద ఘటనకు అదనంగా డ్రగ్ కేసును ఇటీవల శామీర్‌పేట్ పోలీసులు నమోదు చేసిన విషయం సంచలనంగా మారింది. ఇక్కడే శామీర్‌పేట్ పోలీసుల వైఖరి స్పష్టంగా బయట పడింది. యూనివర్సిటీ విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందింతే కారణాలు వెలికితీయకుండా, ఆ విషయాన్ని బయటకు రాకుండా ఉండేలా చూడటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వరుస ఘటనలతో విద్యార్థుల భద్రతపై అటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులలో ఆందోళన నెలకొంటోంది. ఎంతో కష్టపడి నల్సార్‌లో సీట్ సాధించి భవిష్యత్తు న్యాయవాదులుగా మారాల్సిన కొందరు విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస అవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఈ అంశాన్ని యూనివర్సిటీ యాజమాన్యాం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పారదర్శకంగా దర్యాప్తు జరిపితే అసలు విషయాలు బయటకు వస్తాయని, కారణాలు విశ్లేషిస్తూ మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా చూసుకునేందుకు వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అలా అయితేనే విద్యార్థులలో క్రమ శిక్షణ పెరగడంతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని, వర్సిటీలో డ్రగ్స్‌కు అడ్డకట్ట వేసేందుకు ప్రత్యేక కమిటీలు వేయడంతో పాటు విద్యార్థులకు డ్రగ్స్ పర్యవసానాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.