హైదరాబాద్: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని హీరో బాలకృష్ణ (Balakrishna) ఇంటి వద్ద కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి.. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 1లో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. వేగంగా వస్తున్న కారును చూసి భయాందోళనలకు గురైన జనం పరుగులుపెట్టారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కానప్పటికీ.. ఫెన్సింగ్‌తోపాటు కారు ముందుభాగం ధ్వంసమయ్యాయి. కారు మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 మీదుగా జూబ్లీ చెక్‌పోస్టు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా, డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు.