సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక ఓటరు నమోదు సవరణ మందకొడిగా కొనసాగుతున్నది. రాష్ట్రంలోని 33 జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ జిల్లా డిజిటలైజేషన్లో 34.7తో చివరి స్థానంలో ఉన్నది. అదేవిధంగా గ్రేటర్ పరిధిలోని మేడ్చల్ మల్కాజిగిరి 31.7, రంగారెడ్డి జిల్లా 43.9 శాతంతో చివరి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల కంటే ముందుండాల్సిన సిటీ వెనుకబడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఎన్యుమరేషన్ ఫారాలు నింపడటంతో ఓటర్లు ఆసక్తి చూపడంలేదా? బీఎల్వోలు పట్టించుకోవడం లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అంగన్వాడీ హెల్పర్లు, ఆశా వర్కర్లు, కింది స్థాయి సిబ్బందిని బీఎల్వోలుగా నియమించడంతో డిజిటలైజేషన్ చేయడంలో తీవ్ర జాప్యం ఏర్పడుతున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు గడువు సమీపిస్తున్నా ఎన్యుమరేషన్ ఫారాలు సగానికి పైగా బీఎల్వోల దగ్గరే ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఎన్నికల కమిషన్ అధికారులు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తనిఖీలు చేస్తూ మమా అనిపిస్తుండటంతో సర్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. గ్రేటర్ వ్యాప్తంగా ఎన్యుమరేషన్పై అవగాహన కల్పించేందుకు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినా అవి నామమాత్రంగానే పనిచేస్తున్నాయి.
అధికారులెవరూ లేకపోవడంతో వెలవెలబోతున్నాయి. ఇప్పటికీ గ్రేటర్ ప్రజల్లో కొంతమందికి తమ ఎన్యుమరేషన్ ఫారాలు ఎక్కడ తీసుకోవాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. ఇదే తరహాలో నిర్లక్ష్యం కొనసాగితే ఇంకోసారి గడువు పెంచినా గ్రేటర్లో సర్ ప్రక్రియ పూర్తికావడం కష్టసాధ్యమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని జనాభాలో ఎక్కువ మంది విద్యావంతులు, ఎంతోకొంత చదువు, అవగాహన కలిగిన వాళ్లే ఉంటారు. అలాంటి సిటీలో కంటే రూరల్ జిల్లాల్లో డిజిటలైజేషన్ ఎక్కువగా ఉండటం కలవరపెడుతున్నది.
గ్రామీణ ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. చదువు రాని, అవగాహన లేని వారి ఫారాలను బీఎల్వోలే నింపుతున్నారు. ఓటర్లెవరైనా పట్టణ ప్రాంతాలు, ఇతర రాష్ర్టాల్లో ఉంటే వారికి ఫోన్ చేసి వారి ఫారాలను నింపుతున్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది సైతం వారికి సహకరిస్తూ ఓటర్లలో అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క ఓటరు కూడా మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ సిటీలో అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడంలేదు. బీఎల్వోలు పోలింగ్ కేంద్రాలను వీడి బయటకు వెళ్లడం లేదు.
ఓటర్లు తమ దగ్గరికి వస్తేనే ఫారాలు ఇచ్చి పంపిస్తున్నారు. అవగాహన లేనివారు, చదువుకోని వారు తమ అనుమానాలు నివృత్తి చేయాలని అడిగినా నిర్లక్ష్యపు సమాధానాలు చెప్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ఫారాల పంపిణీ లెక్కల్లోనే వంద శాతం చూపుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం 50 శాతం కూడా పంపిణీ పూర్తికాలేదు. పంపిణీ అయిన పత్రాలు కూడా కొంత వరకు బీఎల్వోలకు చేరలేదు. ఒకవేళ బీఎల్వోలకు అందినా డిజిటలీకరణలో తీవ్ర ఆలస్యం చేస్తున్నారు. ఇదేవిధానం కొనసాగితే గడువులోకాగా వంద శాతం డిజిటలీకరణ పూర్తవడం కష్టంగానే కనిపిస్తున్నది. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.