సిటీబ్యూరో, సెప్టెంబరు 24 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ నగరంలో దీర్ఘకాలికంగా, అపరిష్కృతంగా ఉన్న సీవరేజీ సమస్యల నివారణపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు సంస్థ ఎండీ అశోక్‌రెడ్డి గత కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం డివిజన్-6లోని పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. మొదట కృష్ణానగర్ సీ బ్లాక్ ప్రాంతంలో సీవరేజీ నెట్వర్క్ పైపులైన్‌ను పరిశీలించారు..
ఇది 30 ఏండ్ల క్రితం నిర్మించింది కావడంతోపాటు జీహెచ్ఎంసీ నాలాకు అనుసంధానమై ఉంది.. దీంతో ఎల్లారెడ్డి సెక్షన్ పరిధిలో తరచూ సీవరేజీ ఓవర్‌ఫ్లో సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన గుర్తించారు. అనంతరం అమీర్‌పేట మెయిన్‌రోడ్, శ్రీనగర్ కాలనీ ఆటో స్టాండ్ జంక్షన్ ప్రాంతంలోని మురుగునీటి సమస్యను పరిశీలించారు.
సీవరేజీ ఓవర్ ఫ్లోతో ఆ నీళ్లంతా సెల్లార్లోకి వస్తున్నాయని స్థానికులు ఎండీకి వివరించారు. అనంతరం సనత్‌నగర్‌లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ వాల్వ్ టెక్నాలజీ( ఆటోమెటిక్ వాల్వ్ ఆపరేషన్ పద్ధతి)ని ఎండీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీజీఎం ప్రభు, జీఎం హరిశంకర్ , మేనేజర్, తదితరులు పాల్గొన్నారు.
ఆనంద్‌నగర్‌లో ఈడీ పర్యటన
జలమండలి ఓఅండ్ఎం డివిజన్-6 పరిధిలోని ఆనంద్‌నగర్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్ పర్యటించారు. ఆ ప్రాంతంలోని తాగునీటి సరఫరా, నాణ్యత, సప్లయి లెవల్స్, మురుగునీటి నిర్వహణ, తదితర పనులను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఈడీ సూచించారు. ఈడీ వెంట సీజీఎం ప్రభు, జీఎం హరిశంకర్, డీజీఎం, మేనేజర్, తదితరులు పాల్గొన్నారు.