సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): నూతన సంవత్సర వేడుకలపై ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈవెంట్స్ , పబ్స్, ఫామ్ హౌస్, బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాల నిర్వాహకులతో ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఏటా కొత్త సంవత్సర వేడుకలు వచ్చాయంటే డ్రగ్స్ వాడుతూ పట్టుబడుతున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. మరో వైపు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భారీగా వాహనదారులు పట్టుబడుతుంటారు.
ఈ నేపథ్యంలోనే డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు ముందు నుంచి తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ ప్రక్రియ 31వ తేదీ వేడుకలు పూర్తయ్యే వరకు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. మొదటి రోజు నిర్వహించిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 304 మంది పట్టుబడినట్లు తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనలు పాటించిన వారిపై భారీ జరిమానాలు, జైలు శిక్షలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. అలాగే రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆయా సంస్థల నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేసి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనలు వారికి వివరించారు.
ఇన్సిడెంట్ ఫ్రీగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేలా అన్ని ప్రాంతాల్లో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వివరించారు. మరో వైపు మేడిపల్లి పోలీసులతో కలిసి ఈగల్ టీమ్ డ్రగ్స్‌పై నిఘా పెట్టింది. ఇందులో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు పబ్‌లు, ఫామ్ హౌస్‌లపై ప్రత్యేక నిఘాను పెట్టారు. గతంలో డ్రగ్స్‌తో పట్టుబడ్డ నిందితులు ఎక్కడున్నారు? వారి కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నాయనే విషయాలను ఆరా తీస్తున్నారు.