సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో ఏర్పాటు చేసే గణపతి విగ్రహాల తరలింపులో, మండపాల వద్ద విద్యుత్ సరఫరా పట్ల అప్రమత్తంగా ఉండాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి మండప నిర్వాహకులకు, ప్రజలకు సూచించారు. సోమవారం అర్ధరాత్రి బండ్లగూడలో వినాయక విగ్రహం తరలిస్తున్న క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు యువకులు మృతి చెందారు.
అదే సమయంలో అంబర్‌పేటలో మండపం ఏర్పాటు చేస్తుండగా మరో యువకుడు మృతి చెందాడు. బండ్లగూడలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎండీ ముషారఫ్ మంగళవారం సందర్శించారు. ఈ ఘటనల్లో విద్యుత్‌షాక్‌కు గురై పలువురు మరణించడం బాధాకరమని, అయితే రెండురోజులుగా జరిగిన ఘటనల్లో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం లేనప్పటికీ ఇతర కారణాల వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరిగిందని ముషారఫ్ అన్నారు.
ఈనెల 27న వినాయక చవితి సందర్భంగా విగ్రహాల తరలింపు ముమ్మరంగా జరుగుతున్నదని, విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండి విగ్రహాలు తరలించే రహదారుల్లో విద్యుత్ నెట్వర్క్ పరంగా ఎలాంటి లోపం లేకుండా చూడాలని ఆదేశించారు. గ్రేటర్లో ఇప్పటికే ప్రమాదకరంగా ఉన్న ఎల్టీ/11కేవీ నెట్‌వర్క్‌లోని ఓవర్‌హెడ్‌లైన్ల స్థానంలో ఏబీకేబుల్ ఏర్పాటు చేస్తున్నామని, మరోవైపు యుద్ధప్రాతిపదికన విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుల్స్ తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్‌శాఖ పక్షాన ఉత్సవ, మండప నిర్వాహకులకు సీఎండీ ముషారఫ్ పలు సూచనలు చేశారు.
విగ్రహాల తరలింపులో ఇవి పాటించండి
ఎత్తునుబట్టి రూట్‌ని నిర్ణయించుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా సమస్యలుంటే విద్యుత్ సిబ్బందికి తెలపాలి.
ప్రవహించే విద్యుత్ సరఫరా ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి వాటి నుంచి కనీసం రెండు అడుగుల దూరంలోనే ఉండాలి.
ణోకేన్లు, ట్రక్స్, ఎత్తైన మెటల్ విగ్రహాల తరలింపులో మరింత అప్రమత్తంగా ఉండాలి.
ఫ్రేమ్‌లతో కూడిన డెకరేషన్లను తగ్గించాలి.
మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోండి..
విద్యుత్ సరఫరా కనెక్షన్ కోసం సామాన్యులు స్తంభాలు ఎక్కరాదు. సంస్థ సిబ్బంది ద్వారానే విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలి.
మార్క్ కలిగిన ప్రామాణిక విద్యుత్ వైర్లను మాత్రమే వాడాలి.
విద్యుత్ సంబంధిత పనులు చేసేటప్పుడు పరిసరాలను క్షుణ్నంగా పరిశీలించాలి.
ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలితే వారికి వెంటనే వైద్యసహాయం అందించి..విద్యుత్ సిబ్బందికి తెలపాలి.
వైరింగ్‌లో ఎక్కడైనా లీకేజ్ ఉంటే వర్షాలు కురిసినప్పుడు తేమవల్ల షాక్ కలిగే అవకాశముంటుంది. మండ ప నిర్వాహకులు తప్పనిసరిగా వైరింగ్‌ను పరిశీలించాలి.
లైన్లు ఎక్కడైనా తెగిపడ్డా, ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే 1912కు గానీ సమీప ఫ్యూజ్ ఆఫ్ కాల్‌కు గానీ కాల్చేసి సమస్య చెప్పాలి.