సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యార్థులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చాలని ఆటోలు, వ్యాన్, బస్సు డ్రైవర్లకు హైదరాబాద్ పోలీసులు సూచించారు. ఇందులో భాగంగా గత నెల 27వ తేదీ నుంచి నగర పోలీసులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 8,930 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
ఆర్టీఏతో సమన్వయం చేసుకుంటూ.. ఉదయం 7.30 నుంచి 9.30, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ డ్రెవ్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 15 రోజుల వ్యవధిలో నమోదైన కేసుల్లో 691 మంది వద్ద డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో కేసులు నమోదు చేశామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్కు పంపించే వాహనాల డ్రైవర్లకు లైసెన్స్ ఉందా.! వాహన పత్రాలు ఉన్నాయా.! అనే విషయాలు పరిశీలించాలని సూచించారు.