సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ ): చికెన్‌గున్యా కేసుల నివారణకు ఈ నెల 3వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టి, యాంటీ లార్వా ఆపరేషన్ కార్యక్రమాలను నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట సంబంధిత అధికారులను ఆదేశించారు. చికెన్‌గున్యా కేసు నమోదైన ఇంటి చుట్టు పక్కల 50 నుంచి 100 ఇండ్ల వరకు సర్వేచేసి, దోమల ఉత్పత్తి జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ నీరు నిల్వ ఉన్నట్లయితే యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్ చేయాలని సూచించారు. తాళం వేసిన ఇల్లు, భవన నిర్మాణ స్థలాలు, ఫంక్షన్ హాల్స్, ఓపెన్ ప్లాట్స్ సందర్శించి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో చికెన్‌గున్యా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు.
నీటి నిల్వ ఉన్న తొట్లు, డ్రమ్ములు, కూలర్లలో నీటిని తొలగించి శుభ్రం చేయాలని, టైర్లు, ఖాళీ కొబ్బరి బోండాలను తొలగించాలని, చిన్న చిన్న నీటి గుంతలను పూడ్చాలని, మురుగునీటిలో ఆయిల్ బాల్స్ వేయాలని, ఫ్రెష్ వాటర్‌లో గంబూషియా చేపలు వదలాలని కమిషనర్ సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకొని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో నమోదైన చికెన్‌గున్యా కేసులకు టెస్టులు చేయాల్సిందిగా ఆదేశించారు.
ప్రైవేట్ హాస్పిటల్ నుంచి వచ్చే రోజువారీ కేసుల వివరాలు చీఫ్ ఎంటమాలజిస్ట్ ఆఫీస్‌కు పంపితే వెంటనే యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్, స్ప్రేలు చేసి చికెన్‌గున్యా కేసులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అపార్ట్మెంట్స్, సెల్లార్లలో యాంటీ లార్వా ఆపరేషన్లు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికెన్‌గున్యాకు సంబంధించిన రోగి వివరాలు, అడ్రస్‌తో సహా విధిగా నమోదు చేయాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో చికెన్‌గున్యాను నియంత్రించేలా ఎంటమాలజీ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి నగరంలో చికెన్‌గున్యా నివారణకు బాధ్యతగా పనిచేయాలని కమిషనర్ ఆమ్రపాలి సూచించారు.