సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో ఏర్పాటు చేసిన థీమ్ పార్కులకు నగరవాసుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సాధారణ పార్కులకు భిన్నంగా వీటిని ఏర్పాటు చేస్తుండటంతో మంచి రెస్పాన్స్ వస్తున్నది. చిన్నారులకు ఆట స్థలాలు, పెద్దలకు ప్రశాంత వాతావరణంతో పాటు ప్రత్యేకంగా థీమ్ బెస్డ్ పార్కులను జీహెచ్ఎంసీ ప్రజలకు పరిచయం చేస్తున్నది. ఇప్పటికే యానిమల్ కింగ్ డమ్, కలర్స్, జపనీస్, జెన్ గార్డెన్, చిల్డ్రన్స్, ఉమెన్స్, సీతాకోక చిలుక, ఆక్సిజన్, షేడ్, మల్టీ జనరేషన్, కల్చర్, జిమ్, ఇల్యూషన్, ఇంటరాక్టివ్, ప్లే, ఇంటిగ్రిటీ, ఎన్విరాన్మెంట్, బతుకమ్మ, జంగిల్, ఎల్ఈడీ పార్కులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ జాబితాలో మరో థీమ్ పార్కు చేరుతోంది. కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్‌లో సోలార్ ఎనర్జీ థీమ్ పార్కు రూ. 2.5 కోట్లతో అభివృద్ధి చేశారు. ఎకరా స్థలంలో చెట్టు ఆకారంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి, సోలార్ పర్గోలా థీమ్‌పై ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర చిత్ర పటాన్ని 33 జిల్లాల మ్యాప్‌ను ఏర్పాటు చేశారు. ఈ రెండు కలిపి 8.75 కిలోవాట్ల సామర్థ్యంతో ఈ ఎనర్జీ పార్కును ఏర్పాటు చేశారు. పార్కులో విద్యుత్ అవసరాలకు మించి విద్యుత్ ఉత్పత్తి కానుంది. అదనపు విద్యుత్‌ను టీఎస్ ఎస్పీడీసీఎల్కు మళ్లించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పిల్లలకు ఆట స్థలం..వాకింగ్ జోన్, స్మార్ట్ బెంచీలు తదితర మౌలిక వసతులు కల్పించారు. తెలంగాణ ఎల్ఈడీ మ్యాప్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ ఎనర్జీ థీమ్ పార్కు పనులు తుది దశలో ఉన్నాయని, త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత తెలిపారు.