సిటీ బ్యూరో, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ): విద్యుత్ సమస్యలపై ఎస్పీడీసీఎల్ అధికారులు చేపట్టిన కరెంటోళ్ల బస్తీబాటతో క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని పది సర్కిళ్లల్లో విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవడానికి సిబ్బందితో కలిసి నగరవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లో ఉన్న లోపాలు కూడా బయటపడుతున్నాయి. చాలా కాలనీల్లో విద్యుత్ పంపిణీ తీరులో సమస్యలు ఉన్నాయని, లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కరెంట్ హెచ్చుతగ్గులు వస్తున్నదని, సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని గ్రహించారు.
ఆయా ప్రాంతాల్లో అదనంగా డీటీఆర్లు ఏర్పాటు చేయాలని సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ పర్యటించిన సందర్భాల్లో ఆదేశాలు జారీ చేశారు. నగర ప్రజల విద్యుత్ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ బస్తీబాటలో ఇప్పటివరకు సుమారుగా చిన్నపెద్ద సమస్యలు కలిపి ఐదువేలకు పైగా అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. వీటిలో చిన్నచిన్న సమస్యలను అప్పటికప్పుడే లేదా రెండుమూడురోజుల్లో పరిష్కరించినప్పటికీ డిటిఆర్లు, కేబుళ్ల విషయంలో మాత్రం సందిగ్దత నెలకొంది. ముఖ్యంగా కొంత సామాగ్రి సమకూర్చాల్సిన చోట అవి అందుబాటులో లేకపోవడంతో సమస్యలు అలాగే ఉంటున్నాయి. దీంతో అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులపై స్థానికులు క్షేత్రస్థాయి సిబ్బందిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఆగస్ట్‌లో ఏడురోజుల పాటు చేసిన స్పెషల్ డ్రైవ్‌లో చాలాచోట్ల వదులుగా ఉన్నతీగలు, స్పేసర్స్ ఏర్పాటు చేయడం, వదులుగా ఉన్న హెచ్‌జీ ఫ్యూజ్సెట్, ఎల్టీ ఫ్యూజ్సెట్, డీటీఆర్ వైరింగ్, దెబ్బతిన్న జాయింట్లు ఉన్న లైన్ల స్థాయిలో ఏబీకేబుల్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. కొన్నిచోట్ల వెంటవెంటనే పనులు చేపట్టారు. ఆ తర్వాత వారానికి రెండు నుంచి మూడురోజులు క్షేత్రస్థాయిలో ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలు, సిబ్బంది పోల్టూపోల్ తిరుగుతూ కాలనీలు, బస్తీల్లో స్థానికుల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు.
అయితే ఆ సమయంలో వచ్చిన ఫిర్యాదుల్లో కీలకమైన కరెంట్ హెచ్చుతగ్గులతో పాటు డిటిఆర్ల ఏర్పాటు విషయంలో అధికారులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఉంది. అంతేకాకుండా మరికొన్ని సమస్యలు కూడా తాము పరిష్కరించలేని స్థితిలో ఉన్నతాధికారులకు తెలిపినా వారి నుంచి సరైన స్పందన ఉండడం లేదని అధికారులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఒకసారి బస్తీబాట పట్టి అక్కడి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నతర్వాత అవి పరిష్కరించకపోతే తాము ఎలా మళ్లీ అక్కడకు వెళ్లగలమనే ప్రశ్న తలెత్తుతోంది.
బస్తీబాటలో వచ్చిన సమస్యలు పరిష్కరించడం తమకు తలనొప్పిగా మారిందని, సిబ్బంది లైన్ల వద్దకు వెళ్తే తమ సమస్య తీర్చాలంటూ అడుగుతున్న ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారని కొందరు ఇంజనీర్లు చెప్పుకున్నారు. తమ సర్కిళ్లలో ప్రజల ఫిర్యాదులపై డిస్కం ఉన్నతాధికారులకు లెటర్లు రాసినా ఏం స్పందన లేదని, వేసవికి సన్నద్దం కావాలంటే కూడా అందుకు తగిన వనరులు లేవంటూ గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం ప్రజల సమస్యలు పరిష్కరించాలంటే చిన్నచిన్నవి వెంటవెంటనే అయిపోతున్నా పెద్దవాటి విషయంలో కొన్నిరోజుల పాటు మభ్యపెట్టగలం కానీ సమ్మర్ వస్తే ఏం చెప్పాలంటూ తలలుపట్టుకుంటున్నారు.