సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ ఫోన్ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మారుస్తున్న ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, టెలీకాం విభాగంతో కలిసి పట్టుకున్నారు. వీవోఐపీ(వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్)ని ఉపయోగిస్తూ సంతోష్‌నగర్, బాలాపూర్‌లో మినీ ఎక్సేంజీలను ఈ ముఠా నిర్వహిస్తున్నది. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రష్మీపెరుమాల్ మీడియాకు వివరాలు వెల్లడించారు. వివిధ దేశాల నుంచి మన దేశానికి వచ్చే ఫోన్ కాల్స్‌ను డీవోటీ(డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్) గేట్‌వేల నుంచి ఆయా ప్రొవైడర్ల ద్వారా వినియోగదారుడికి చేరుతుంది.
అయితే దుబాయ్, ఖతార్, సౌదీ తదితర దేశాల నుంచి వచ్చే కాల్స్‌ను గేట్‌వేలకు సంబంధం లేకుండా అక్రమంగా ఐఎల్‌డీ ఎక్సేంజీలను ఏర్పాటు చేసి రీ రూటింగ్ చేస్తున్నారు. నిందితులు ఉపయోగించే మినీ ఎక్ఛేంజ్‌లలో పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ర్టాల నుంచి సిమ్‌కార్డులు కొని ఇక్కడ వాడుతున్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కాల్‌ను రీరూటింగ్ చేసి ఈ ఎక్సేంజీల ద్వారా లోకల్ కాల్స్‌గా మారుస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఈ మినీ ఎక్సేంజీలపై పోలీసులు దాడి చేసి.. నిందితులు హిదాయత్, ముజాహిద్ అహ్మద్‌లను అరెస్టు చేశారు. వందలాది సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు.