రామచంద్రాపురం, డిసెంబర్ 6: సినీతార శ్రీలీల ఆర్సీపురం సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సందడి చేసింది. ఆర్సీపురంలోని జాతీయ రహదారిని ఆనుకొని నూతనంగా ఏర్పాటు చేసిన 37వ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ హీరోయిన్ శ్రీలీల ముఖ్య అతిథిగా హాజరైంది. ముందుగా ఆమెకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యజమానులు వెంకటేశ్వర్లు, రాజమౌళి స్వాగతం పలికారు. అనంతరం, ఎండీ వెంకటేశ్వర్లుతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిసి హీరోయిన్ శ్రీలీల షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం షాపింగ్ మాల్లో కలియతిరుగుతూ ఫస్ట్, సెకండ్ తదితర ఫ్లోర్లకు వెళ్లి సందర్శించారు.
ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్‌లోని సారీ కౌంటర్ వద్దకు వచ్చారు. సౌత్ ఇండియాకు సంబంధించిన చీరలను మీడియా ముందు ఆవిష్కరించారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని, స్థానికులకు సంస్థ డైరెక్టర్లు అయిన సురేశ్ సీర్ణ, అభినయ్, రాకేశ్, కేశవ్‌లు స్వాగతం పలికారు. డైరెక్టర్ సురేశ్ మాట్లాడుతూ, బీహెచ్ఈఎల్, రామచంద్రాపురం వాసులు కోరుకునే నాణ్యతకు, నవ్యత్వానికి పెద్ద పీట వేశామన్నారు. డైరెక్టర్ అభినయ్ మాట్లాడుతూ, పర్వదినాలకు, భారతీయ సంప్రదాయ కలెక్షన్లకు తమ షోరూమ్ విశేషమైన కేంద్రంగా నిలుస్తుందన్నారు.
మరో డైరెక్టర్ రాకేశ్ మాట్లాడుతూ, తమ షోరూమ్ అన్ని రకాల వస్ర్తాలకు ధరల్లోనూ, నాణ్యతలోనూ వస్త్ర ప్రియుల అభిరుచులను ప్రతిబింబిస్తున్నదన్నారు. ఇంకా డైరెక్టర్ కేశవ్ మాట్లాడుతూ, వైవిధ్యభరితమైన వస్ర్తాలను కోరుకునే కొనుగోలుదారులు అతి పెద్ద సంఖ్యలో ప్రతి వెరైటీని అందించేందుకు తాము ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 37వ బ్రాంచ్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉన్నదని, మున్ముందు సౌత్ ఇండియా మాల్స్ ప్యాన్ ఇండియాకి ఎదగాలని ఆకాంక్షించారు.
సౌత్ ఇండియాలో సరసమైన ధరలకే వినియోగదారులు షాపింగ్ చేయవచ్చని, పండుగలు, శుభకార్యాలకు సౌత్ ఇండియాలోనే షాపింగ్ చేయాలన్నారు. అక్కడి నుంచి మాల్ బయట ఏర్పాటు చేసిన స్టేజి వద్దకు వచ్చి అభిమానులతో మాట్లాడి వారిలో జోష్ నింపారు. అభిమానులను ఉత్సాహపర్చుతూ మాట్లాడారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని ఆదరించాలన్నారు. అందాల తారను వారి ఫోన్లల్లో బంధించేందుకు అభిమానులు ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అవకాశం దొరికిన వారు ఆమెతో సెల్ఫీలు దిగారు. ఇదిలా వుంటే ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇన్స్పెక్టర్ జగన్నాథ్ నేతృత్వంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్పా నగేశ్, ఎస్సై రామకృష్ణ, షాపింగ్ మాల్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.