శేరిలింగంపల్లి, జులై 2: బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పోగొట్టిన కుమారుడిని మందలించినందుకు తండ్రి మీద కక్ష పెంచుకున్న ఓ కొడుకు కన్న తండ్రినే దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం సొంతూరికి తరలించాడు. గచ్చిబౌలి పోలీసుల రంగ ప్రవేశంతో పన్నాగం బెడిసి కొట్టి, హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలి పీఎస్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
వనపర్తి జిల్లా ఘనపూర్ మండలం కోతులగుట్టకు చెందిన కేతావత్ హనుమంతు (37) నగరానికి వలస వచ్చాడు. భార్య, ఇద్దరు కుమారులు కేతావత్ రవీందర్ (19), సంతోష్‌తో కలిసి గోపనపల్లి ఎన్టీఆర్నగర్ కాలనీలో ఉంటూ మేస్త్రీగా పని చేస్తున్నాడు. అవసరాల కోసం హనుమంతు రూ.6 లక్షల లోన్ తెచ్చాడు. ఇంటర్ చదివి ఖాళీగా ఉంటూ జల్సాలకు అలవాటు పడిన పెద్ద కొడుకు రవీందర్ లోన్ డబ్బును బెట్టింగ్ యాప్‌లో పోగొట్టాడు. దీంతో కుమారుడిని హనుమంతు తీవ్రంగా మందలించాడు. కాగా తండ్రిపై కక్ష పెంచుకున్న రవీందర్ హత్య చేయాలని పథకం వేశాడు.
ఇందులో భాగంగా ఈ నెల 1న మధ్యాహ్నం గోపనపల్లి పరిధిలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తండ్రిని తీసుకువెళ్లి కత్తితో దాడి చేసి, గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం గోపనపల్లిలోనే ఉంటున్న తన బాబాయి రమేష్‌కు ఫోన్ చేసి తండ్రి కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. రవీందర్ మాటలు నమ్మిన కుటుంబ సభ్యులు, బంధువులు హనుమంతు మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం సొంత ఊరు కోతులగుట్టకు తరలించారు.
దహన సంస్కారాలు బుధవారం నిర్వహించేందుకు కోతులగుట్టలో కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగా.. విషయం గచ్చిబౌలి పోలీసులకు తెలిసింది. అనుమానం వ్యక్తం చేసిన గచ్చిబౌలి పోలీసు లు ఘనపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హనుమంతు మృతిపై కేసు నమో దు చేయాలని, లేదంటే తామే కేసు నమో దు చేస్తామని గచ్చిబౌలి పోలీసులు తేల్చి చెప్పారు.
గామ పెద్దలతో మాట్లాడి అంత్యక్రియలు నిర్వహిస్తే అందరి మీద కేసు అవుతుందని హెచ్చరించారు. స్పందించిన ఘనపూర్ పోలీసులు శవాన్ని తిరిగి గచ్చిబౌలికి పంపించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించిన పోలీసులు కుమారుడు రవీందర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, తన తండ్రిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో రవీందర్‌ను అరెస్టు చేసిన గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.