సిటీబ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): డ్రగ్ ఎలా ఉంటుందో మాకు తెలియదు.. మేము అమాయకులం.. అంటూ టీనాబ్ విచారణలో కొందరు డ్రగ్ వినియోగదారులు చెబుతున్నారు. వాళ్లు చెబుతున్న విషయాలతో అధికారులు విస్మయం చెందుతున్నారు. డ్రగ్ పెడ్లర్లు, వారి వద్ద డ్రగ్ తీసుకొని వాడుతున్న వినియోగదారులకు సంబంధించిన చిట్టాను టీనాబ్ నివేదిక రూపంలో తయారు చేసింది. ఆ నివేదిక ఆధారంగానే విచారిస్తున్నారు. డ్రగ్ వినియోగదారులు మాత్రం పొంతనలేని సమాధానమిస్తున్నారని తెలిసింది.
నెల రోజుల కిందట మాదాపూర్‌లో బయటపడ్డ డ్రగ్ పార్టీ వ్యవహారంలో సినీ ఫైనాన్సియర్ వెంకటరత్నాకర్ రెడ్డి, భాస్కర్ బాలాజీ, మురళిని అరెస్ట్ చేసి, వారి నెట్‌వర్క్‌ను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ఇందులో చాలా మంది వినియోగదారులను అరెస్ట్ చేయగా.. కొందరు ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లారు. పోలీసుల ఎదుట లొంగిపోయి, పోలీసుల విచారణకు సహకరించాలంటూ వారిని న్యాయస్థానం ఆదేశించింది. అదేవిధంగా వారికి 41 సీఆర్ప్సీ కింద నోటీసులు ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సినీ హీరో నవదీప్ పోలీసుల ముందు హాజరయ్యాడు. అలాగే, ఈవెంట్స్ నిర్వాహకుడు కలహార్‌రెడ్డి, మరికొందరు కూడా గుడిమల్కాపూర్ పోలీసుల ముందు లొంగిపోయారు. మాదాపూర్ కేసులో 81 మంది అనుమానితుల వివరాలను టీనాబ్ సేకరించింది. అందులో 34 మంది వివరాలను సేకరించి, 12 మందిని అరెస్ట్ కూడా చేశారు.
తమకేమీ సంబంధం లేదు.!
విచారణలో డ్రగ్ వినియోగదారులు ఇస్తున్న సమాధానాలకు పొంతన ఉండటంలేదు. తమకు డ్రగ్ అలవాటు లేదంటూ కొన్ని సార్లు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఫలాన డ్రగ్ పెడ్లర్‌తో మీకున్న సంబంధాలేంటీ.. అని లోతుగా ప్రశ్నించే వరకు ఇప్పుడు కాదు చాలా రోజుల కిందట డ్రగ్ తీసుకున్నామని, ఇప్పుడు మారిపోయానంటూ సమాధానాలు చెబుతున్నారు. వీళ్లు చెప్పే సమాధానాలను సాంకేతిక పరంగా టీనాబ్ నిర్ధారించుకుంటున్నది. అయితే, వినియోగదారులు డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ జరిగితే.. అలాంటి వారిని అరెస్ట్ చేస్తున్నారు.
పోలీసులకు ప్రధాన నిందితులు దొరకగానే.. వారి నెట్‌వర్క్‌లో ఉన్న వారందరి సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. పోలీసుల నిఘా నుంచి కొన్నాళ్ల పాటు తప్పించుకోవాలని వారు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అలస్యంగా పోలీసులకు చిక్కడంతో వైద్య పరీక్షల్లో డ్రగ్ ఆనవాళ్లు దొరకవనే భావనతో చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్ పెడ్లర్లతో పాటు వినియోగదారులపై టీనాబ్ మరింత నిఘాను పెంచింది.