సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): కొందరు ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాన్ల విషయంలో హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు. పెండింగ్చలాన్ల వసూళ్ల విషయంలో తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. హైకోర్టు ఆదేశాలు వెలువడి ఇరవై నాలుగు గంటలు పూర్తి కాకముందే బుధవారం నగరంలో చాలాచోట్ల ట్రాఫిక్ పోలీసులకు ఆటోలు, బైక్‌లు కనబడితే చాలు..తమ చేతిలో ఉన్న ట్యాబ్‌లు తీసి పెండింగ్ చలాన్ల చిట్టావిప్పుతూ బలవంతంగా వసూలు చేశారు.
ఒకవైపు హైకోర్టు వాహనదారులను ఆపొద్దంటూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. సికింద్రాబాద్‌లోని టివోలి క్రాస్‌రోడ్స్ వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వాహనాలు ఆపుతూ జరిమానాలు చెల్లించాల్సిందేనని వాహనదారులపై ఒత్తిడి తెచ్చారు. హైకోర్టు ఉత్తర్వులను ఎందుకు ఉల్లంఘిస్తున్నారని వాహనదారుడు అడిగితే అక్కడే బూత్‌లో ఉన్న మరో కానిస్టేబుల్ నువ్వు ఎవరికైనా చెప్పుకో.. మాకేం ఆర్డర్లు రాలేదంటూ దురుసుగా సమాధానమిచ్చాడంటూ వాహనదారుడు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. పద్మారావునగర్‌లో కొందరు వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు ఆపి వాహనాలను సీజ్ చేయడంతో వారు పెండింగ్ చలాన్లు కట్టి వెళ్లినట్లుగా మీడియాతో చెప్పారు. ఇలా చాలాచోట్ల ట్రాఫిక్ పోలీసులు తమకు ఇంకా ఆదేశాలు రాలేదంటూ చెప్పడంతో వాహనదారులకు పెండింగ్ తిప్పలు తప్పలేదు.
ఆదేశాలు రాలేదు..
పెండింగ్ చలాన్ల విషయంలో వాహనదారులకు ఊరటనిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గత కొంతకాలంగా ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాన్ల పేరుతో వాహనాలను ఆపుతూ ఇబ్బందులు పెడుతున్నారన్న ఫిర్యాదు మేరకు కోర్టు విచారణ చేపట్టింది. ట్రాఫిక్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ చలాన్లు కట్టాలంటూ వాహనాన్ని ఆపవద్దని, వారి బండి తాళాలు తీసుకోవద్దని ఆదేశించింది. వాహనదారుడు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే తీసుకోవాలని, లేకపోతే పెండింగ్ చలాన్లను చట్టప్రకారం కోర్టు ద్వారా సమన్లు జారీ చేసి వసూలు చేయాలని స్పష్టం చేసింది. సాధారణ విధుల్లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించడానికి ఈ ఉత్తర్వులు అడ్డంకి కాదని చెప్పినప్పటికీ అయితే మంగళవారం ఆదేశాలు వచ్చినట్లు మీడియాలో వచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పోలీసులు అవేవీ తమకు తెలియదని, తమ పై అధికారులు చెప్పేవరకు పెండింగ్ వసూళ్లు ఆపేది లేదని తేల్చి చెప్పారు.
నగరంలోని పలు కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు పహారా కాస్తూ ఉదయాన్నే ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లేవారిని ఆపి వసూలు చేసిన విధానంపై వాహనదారులు మండిపడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫొటోలు తీయడమే కాకుండా పాత చలాన్లు అంటూ వాటిని కూడా కట్టి వాహనం తీసుకెళ్లాలని చెప్పడంతో వాహనదారులు షాకవుతున్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గురించి ట్రాఫిక్ పోలీసులకు చెప్పినా వారు పట్టించుకోకుండా తమ పై అధికారులు ఈ వసూళ్ల విషయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, ఆపమని చెప్పలేదని తమను ప్రశ్నించిన వాహనదారులకు కొందరు పోలీసులు చెప్పడం గమనార్హం.
చార్జిషీట్ దాఖలు చేస్తాం..
నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలాన్లు వేస్తున్నాం. ప్రతీ వాహనాన్ని ఆపి చెక్ చేసే హక్కు మోటార్ వెహికల్ చట్టం ద్వారా ట్రాఫిక్ పోలీసులకు ఉంటుంది. ఈ క్రమంలో మా తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే పెండింగ్ చలాన్ల విషయంలో హైకోర్టు ఆదేశాలను పాటిస్తాం. చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పినప్పుడు వాళ్లు కడతామంటే కట్టించుకుంటామని లేకుంటే వారిపై చార్జ్‌షీట్ వేసి కోర్టులో సమర్పిస్తాం.
– అవినాశ్‌కుమార్, నగర ట్రాఫిక్ డీసీపీ