సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ‘అవినీతికి కాదేదీ అనర్హం’ అనే వాక్యం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలోని కొంతమంది అధికారులకు సరిగ్గా సరిపోయేలా ఉన్నది. పీసీబీలోని కొంత మంది అధికారులు అందినకాడికి దోచుకుంటూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ప్రతి చిన్న పనికీ లక్షలు, వేలల్లో బిల్లులు పెట్టుకుంటూ కమిటీ ఆమోదం పొందేలా చూసుకుంటున్నారు.
కాలుష్య నియంత్రణ మండలి స్వయం ప్రతిపత్తి సంస్థ కావడంతో వచ్చిన ఆదాయం అంతా ఉద్యోగులు, సిబ్బంది జీతాలతో పాటు మెయింటెనెన్స్ ఖర్చులకు ఇష్టానుసారంగా బిల్లులు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా కార్యాలయ ప్రాంగణ సుందరీకరణకు అయ్యే ఖర్చును మూడు నాలుగు రెట్లు ఎక్కువగా బిల్లులు పెడుతూ విచ్చలవిడిగా దోచుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఉన్నతాధికారులు సైతం వారి అవినీతిని చూసీ చూడనట్లు వదిలేయడంతో అందిన కాడికి దండుకుంటున్నారు.
ప్రధాన కార్యాలయ మెయింటెనెన్స్ ఖర్చు పేరిట ఏటా లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని మింగేస్తున్నారు. గత మార్చి నుంచి ఈనెల దాకా సుందరీకరణ పేరిట ఏకంగా రూ.4,21,660 ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపుతున్నారు. కానీ ఖర్చు చేసింది మాత్రం అందులో సగం కూడా లేదని తెలుస్తున్నది. కార్యాలయం ముందు రెండు, మొక్కలు నాటి ఖాళీ స్థలంలో గార్డెనింగ్ గ్రాస్ మ్యాట్‌ను ఏర్పాటు చేసినందుకే అంత మొత్తంలో ఖర్చు చేసినట్లు చూపుతున్నారు. కానీ అది చనిపోయి ఎండుగడ్డి దర్శనమిస్తున్నది. ఇదంతా ప్రతి ఏడాది జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
సాధారణంగా ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల ప్రాంగణాలు చూపరులను ఆకట్టుకునేందుకు వివిధ రకాల మొక్కలు నాటుతారు. నేలపై గడ్డి మ్యాట్లను ఏర్పాటు చేస్తారు. అయితే అన్ని కార్యాలయాల కంటే కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ఏర్పా టు చేసిన గడ్డి మ్యాట్లు మాత్రం అత్యంత ఖరీదైనవి. ప్రాంగణమంతా కలిసి దాదాపు 300 గజాల్లో గడ్డి మ్యాట్లు ఏర్పాటు చేశారు.
దానికి ఏకంగా రూ.3.5 లక్షలకు పైగానే ఖర్చు చేసినట్లు తెలుస్తున్నది. సాధారణంగా గ్రాస్ మ్యాట్లను నర్సరీ నుంచి కొనుగోలు చేస్తే ఒక చదరపు అడుగుకు రూ.18 నుంచి రూ.20 వరకు ఉంటుంది. మొత్తం 300 గజాల్లో గడ్డి మ్యాట్లను ఏర్పాటు చేసేందుకు రూ. 5400 నుంచి రూ.6 వేల దాకా అవుతున్నది. మరింత ఖరీదైన గ్రాస్ మ్యాట్లను ఏర్పాటు చేస్తే అదనంగా ఇంకో రూ.2 వేల కంటే ఎక్కువ అయ్యే అవకాశం లేదు. మిగతా మొక్కలు, ఇతర డెకరేషన్లకు సంబంధించి మరో రూ.50 వేల నుంచి రూ.లక్ష దాకా ఖర్చయినా అన్నీ కలుపుకొ ని మొత్తం కలిపి రూ. లక్ష కంటే ఎక్కువగా కాదు. కానీ అధికారులు మాత్రం ఏకంగా రూ. 4,21,660 ఖర్చయినట్లు లెక్కల్లో చూపారు.