రవీంద్రభారతి, ఆగస్టు17:ఎక్సైజ్ శాఖలో కమీషన్ల కోసమే ప్రమోషన్లు ఇవ్వకుండా కొందరు అధికారులు కుట్రలు చేస్తున్నారని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ ఆరోపించారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ప్రమోషన్లు, బదిలీలతో సంతోషంగా ఉంటే ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు మాత్రం ప్రమోషన్లు, బదీలీలు లేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు.
డీసీపీ గడువు ఈనెల 31వ తేదీకి ముగుస్తుందని, అంతలోపు పదోన్నతులు ఇవ్వకుంటే మళ్లీ ఏడాది సమయం పట్టే అవకాశం ఉందన్నారు. మూడు డిపార్టుమెంట్లు వెరిఫై చేసి పంపి నెల రోజులు కావస్తున్నా మంత్రి ఓఎస్డీ అడ్డుపడుతున్నారన్న సమాచారం తమకుందన్నారు. డిప్యూటి కమిషనర్లు.. జాయింట్ కమిషనర్లుగా ప్రమోట్ అయితే అమ్యామ్యాలు రావని మంత్రి సంతకం కాకుండా ఓఎస్డీతో చెప్పిస్తున్నారన్నారు. ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు రెండు, మూడు పోస్టులలో ఇన్చార్జిలుగా పనిచేస్తున్నారని అన్నారు.
ఇన్చార్జిలకు మేలు చేసేందుకు రూ.30 లక్షలు లంచంగా కూడా ఓఎస్డీ పుచ్చుకున్నట్లు అతనిపై ఆరోపణలు వినిపిస్తున్నాయని రాచాల ఆరోపించారు. రాబోవు కొంత టెండర్లలో డబ్బులు దండుకోవడం కోసమే ప్రమోషన్లకు అడ్డుతగులుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.కమిషనర్ కార్యాలయంతో పాటు అన్ని జిల్లాలో ఇన్ని ఖాళీలుంటే కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఒక్క రోజులోనే ఫైల్లు క్లియర్ చేసి పంపిస్తుంటే మంత్రి పేషీలో మాత్రం నెలరోజులు కావస్తున్నా క్లియర్ చేయడంలేదన్నారు.
రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్ డిప్యూటీ కమిషనర్ల పోస్టింగ్‌లు సైతం నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా బదిలీలు జరగక ఎక్సైజ్ కానిస్టేబుళ్లు తీవ్ర మనోవేదనకు గురువుతున్నారని, సీఎం వరం ఇచ్చిన మంత్రి పేషీలో అడ్డుంకులు సృష్టించడం తగదని ఓఎస్డీ తీరుపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గోటూరి రవీందర్‌గౌడ్, గాలిగల్ల సాయిబాబా,మల్లేష్, దివాకర్‌గౌడ్, యశ్వంత్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.