సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : బదిలీ చేసినా.. బల్దియాను వదలమంటున్నారు కొందరు డిప్యూటీ కమిషనర్లు. దాదాపు 20 రోజుల తర్వాత బదిలీపై బల్దియాకు వచ్చిన అధికారులకు ఎట్టకేలకు కమిషనర్ పోస్టింగ్‌లు ఇచ్చారు. అయితే ఒకరిద్దరి పోస్టింగ్‌లపై నేటికీ సస్పెన్స్ కొనసాగుతున్నది. జూబ్లీహిల్స్ సర్కిల్లో డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న అధికారి ఇతర చోటకు బదిలీ అయ్యారు. ఆ పోస్టు భర్తీ చేయలేదు. అయితే ఆ సర్కిల్ బాధ్యతలను ఇతరులను అప్పగించినట్లు ఈ నెల 21న జరిపిన 25 మంది అధికారుల అంతర్గత బదిలీల జాబితాలోనూ పేర్కొనలేదు.
సదరు డిప్యూటీ కమిషనర్‌కు మేయర్ అండదండలు ఉన్నాయని, ఆమె ప్రమేయంతోనే జూబ్లీహిల్స్లోనే కొనసాగేలా.. ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ తిరిగి ఇక్కడే పోస్టింగ్ తెచ్చుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ డీసీ వ్యవహారం ఇలా ఉంటే.. సీడీఏ నుంచి జీహెచ్ఎంసీకి బదిలీ అయిన శ్రీధర్‌ను అక్కడి నుంచి అధికారులు రిలీవ్ చేయడం లేదు. సిద్దిపేటకు బదిలీ అయిన మరో డిప్యూటీ కమిషనర్ తిరిగి జీహెచ్ఎంసీకి వచ్చేలా పైరవీ చేస్తున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది.