సిటీబ్యూరో, నవంబరు 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన సోమా భరత్ కుమార్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనను శాలువాతో సతరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో నష్టాలలో ఉన్న విజయ డెయిరీని సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ, ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నేడు 700 కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరుకుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే నూతనంగా ఔట్ లెట్లను పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసి విజయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇంకా మరిన్ని ఔట్ లెట్ లను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. విజయ డెయిరీ అభివృద్ధి చర్యలలో భాగంగా 250 కోట్ల రూపాయల వ్యయంతో మెగా డైయిరీ నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు.