మేడ్చల్, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ): భూ భారతి పోర్టల్‌లో దరఖాస్తులను తిరస్కరించేందుకే మొగ్గు చూపుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత ఉండేలా చూస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన భూ భారతిలో పోర్టల్ భూ సమస్యల పరిష్కరం కోసం దరఖాస్తులు చేసుకున్నా.. అంతగా సత్ఫాలితాలు రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మేడ్చల్ జిల్లా భూ భారతి పోర్టల్ ప్రారంభమైన నాటి నుంచి 72,169 దరఖాస్తులు ఉండగా..ఇప్పటి వరకు 30, 607 అర్జీలు తిరస్కరించారంటే భూ సమస్యలను ఏ మేరకు రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తున్నారన్నది.. ఉదాహరణగా నిలుస్తుందని చెప్పవచ్చు.
ఏదో చిన్న సాకుతో భారీ సంఖ్యలో దరఖాస్తులను తిరస్కరించినట్లు తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు. అయితే 72, 169 దరఖాస్తుల్లో 26,703 అర్జీలను పరిష్కరించినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 4,491 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొంటున్నారు. మ్యుటేషన్లు, వారసత్వ బదిలీ, నాలా కన్వర్షన్, సక్సెషన్, పీవోబీ పాస్ పుస్తకాల్లో తప్పుల సవరణ తదితర భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులలో వేలాల్లో దరఖాస్తులను తీరస్కరించిన నేపథ్యంలో మళ్లీ తిరిగి దరఖాస్తులు చేసుకోవాల్సి వస్తుందని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
భూ భారతి పోర్టల్‌లో దరఖాస్తులు చేసిన వెంటనే పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పి.. ఇప్పుడేమో దరఖాస్తులను అన్ని తిర్కరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భూ భారతి పోర్టల్‌ను ప్రారంభించన వెంటనే రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించింది. స్వీకరించిన దరఖాస్తులను గత ఆగస్టు 15 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన అమలులో విఫలమైంది. సెప్టెంబర్ నెల పూర్తయినా దరఖాస్తులు మాత్రం పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం ఆర్భాటం చేయడమే తప్ప అమలు చేయించడంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అత్యధిక సంఖ్యలో దరఖాస్తుల తిరస్కరణతో అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. కింది స్థాయి అధికారులు తమ భూ సమస్యలకు సంబంధించిన నివేదికలను కావాలనే తప్పుగా పంపుతున్నట్లు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ సదస్సులలో స్వీకరించిన దరఖాస్తులకు నోటీసులు నామా మాత్రంగానే అందించి ఎలాంటి విచారణ లేకుండానే తిరస్కరణ చేశారని, ఇది కావాలనే జరుగుతున్నట్లు తమకు తెలుస్తుందంటున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో భూముల ధరలు అధికంగా ఉన్న క్రమంలో అధికారులు నివేదికలను అందించడంలో దరఖాస్తుదారులు కలిస్తేనే వారికి అనుకూలంగా నివేదికలు ఇస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. దరఖాస్తులు చేసిన వివిధ సమస్యలు పరిష్కరం కాకపోవడంతో జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో ఫిర్యాదులు చేసినా.. ఎలాంటి ఫలితం ఉండటం లేదని దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.