గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు
రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
నాగారంలో లబ్ధిదారులకు అవగాహన సదస్సు
పాల్గొన్న మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాల లబ్దిదారులు
మేడ్చల్ కలెక్టరేట్, ఫిబ్రవరి 25: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అమలు చేసిన దళిత బంధు పథకం దేశంలో ఘన చరిత్ర సృష్టించిందని రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీలో శుక్రవారం జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాల దళిత బంధు లబ్ధిదారులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డిలు విచ్చేశా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళిత బంధు అమలు చేసి సీఎం కేసీఆర్ దళితులకు దైవంగా మారారని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయినప్పటికీ దళితుల జీవితాలలో ఎలాంటి మార్పు లేదని, గత ప్రభుత్వాలు వారిని పట్టించుకున్న పాపాన పోలేదని గత పాలకుల తీరును ఎండగట్టారు. నేడు మన ముఖ్యమంత్రి దళితులను వ్యాపారస్తులను, గొప్పవారీగా అన్ని రంగాలలో రాణించేలా చేయాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రకటించి రూ.10 లక్షలు ఇస్తున్నారని, వాటితో 47 రకాల వ్యాపారాలు చేసుకోవచ్చని హితోధిక శిక్షణ ద్వారా చెప్పారని చెప్పారు. దళితులు కొత్త ఆలోచనలతో కొత్త వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవాలని, వచ్చే ఏడాది వరకు పది లక్షలను రెట్టింపు చేసుకొని, సమయాన్ని, డబ్బులను వృథా చేయకుండా ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. వచ్చే బడ్జెట్లో దళిత బంధుకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్నారని, ప్రతి నియోజకవర్గానికి 2 వేల మందికి దళిత బంధు పథకాన్ని అందజేస్తున్నట్టు తెలిపారు. మొదటి విడద కింద మార్చి 10వ తేదీ వరకు బ్యాంక్ ఖాతాలలో నగదు జమ అవుతుందని మంత్రి చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక అన్ని వర్గాలు, కులాలకు చెందిన ప్రజలు ఆర్ధికంగా అభివృద్ధి చెందుతున్నారని ఆయన అన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు నేడు దళిత బంధుతో ఒక్కొక్కరికి రూ.10 లక్షలు కేటాయిస్తున్నారని అన్నారు. ఈ పథకంతో దళిత కుటుంబాలు బాగుపడుతాయని, మంచి వ్యాపారాలు నిర్వహించి అన్ని రంగాలలో రాణించాలని ఆయన సూచించారు. అనంతరం, పలువురు నిపుణులు లబ్ధిదారులకు వివిధ వ్యాపారాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, నాగారం, దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, శామీర్పేట్ జడ్పీటీసీ అనితా లాలయ్య, కరీంగూడ సర్పంచ్ కౌకుట్ల గోపాల్ రెడ్డి, జిల్లా అధికారులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.