Suicide | అమీర్‌పేట్, జూన్ 1 : తనను చుట్టుముట్టిన ఆర్థిక, కుటుంబ సమస్యలను పరిష్కరించుకోలేక మానసిక వేదనకు గురైన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మలిపెద్ది వెంకటరెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన తన భార్య, కుమార్తెతో కలిసి కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 30న ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వెంకట్ రెడ్డి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన భార్య యాదాద్రి జిల్లాలో నివాసం ఉంటున్న తన భర్త తండ్రికి విషయాన్ని తెలియజేసింది. ఇటీవలే ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసిన వెంకటరెడ్డిపై ఆర్థిక సమస్యలు మరింత భారంగా మారాయి. దీంతో మానసికంగా కుంగిపోయిన వెంకటరెడ్డి తీవ్ర నిరాశకు లోనైన పరిస్థితుల్లో శనివారం భరత్ నగర్‌లోని ఓయో లివింగ్ ట్రీలో గదిని తీసుకొని, అక్కడి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఆదివారం విషయం వెలుగు చూడడంతో వెంకట్ రెడ్డి మృతి చెందిన విషయాన్ని సనత్ నగర్ పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.