Software Employee | శేరిలింగంపల్లి, మార్చి 03: ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిన జంట ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఆరు నెలలు గడవకముందే ఇద్దరి మధ్య తరచూ గొడవలు ప్రారంభమై తీవ్ర మనస్థాపానికి గురైన భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం…
వికారాబాద్ జిల్లా, తోర్ మామిడి కమలాపురం ప్రాంతానికి చెందిన దేవిక (25) పుణేలో ఎంబిఏ పూర్తి చేసి నగరంలోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నది. ఐఐటి ఖరగ్ పూర్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన మంచిర్యాలకు చెందిన సద్గుర్తి సతీష్ చంద్ర కూడా దేవిక పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ సంస్థలోనే ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఒకే కార్యాలయం కావడంతో దేవిక, సతీష్ చంద్రల మధ్య పరిచయం ఏర్పడి, ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరువైపుల పెద్దలను ఒప్పించి గత ఆగస్టు 23వ తేదీన గోవాలో వైభవంగా వివాహం చేసుకున్నారు.
వివాహం అనంతరం భార్య, భర్తలు రాయదుర్గం పరిధిలోని ప్రశాంతిహిల్స్ లో కాపురం పెట్టారు. పళ్లున కొద్దిరోజులకే భార్య, భర్తల మద్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దేవిక, సతీష్ చంద్రలు ఇంట్లో గొడవ పడ్డారు. దీంతో మనస్థాపానికి గురైన దేవిక తన గదిలోకి వెళ్లి లోపలి నుంచి గడియ పెట్టుకుంది. శతీష్ చంద్ర సైతం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి అర్ధరాత్రి 12 గంటల తరువాత తిరిగి వచ్చాడు.
అప్పటికీ దేవిక గది తలుపులు పెట్టి ఉండడంతో తలుపు తట్టి చూడగా, లోపలి నుంచి గడియపెట్టి ఉండడంతో నిద్రపోయిందని భావించి తనగదిలోకి వెళ్లి నిద్రపోయాడు. తెల్లవారు జామున లేచిన సతీష్ చంద్ర మరోసారి దేవిక గది తలుపుతట్టినా స్పందించలేదు. ఉదయం పనిమనిషి వచ్చి తలుపుకొట్టినా దేవిక తలుపు తీయలేదు. మరోవైపు ఉదయం 10 గంటలకు దేవిక ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా, అప్పటికీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సతీష్ చంద్ర గది తలుపులు బద్దలుకొట్టి చూడగా, గదిలో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని కనిపించింది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు మృతురాలి తల్లి రామలక్ష్మి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా కట్నం కోసం తరచూ శతీష్ చంద్ర వేదించడంతోనే తన కుమార్తె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పోలీసులకు పిద్యాదు చేసింది.