e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home హైదరాబాద్‌ సహృదయులు.. ఆదర్శ సేవలు

సహృదయులు.. ఆదర్శ సేవలు

సహృదయులు.. ఆదర్శ సేవలు
  • కులమతాలు, పేద, ధనిక తారతమ్యం లేకుండా బాసట
  • కరోనా బాధితులకు అండగా నిలుస్తున్న మానవతాహృదయాలు
  • శానిటైజర్లు, మాస్కులు, ఉచిత భోజనం అందజేస్తున్న కొందరు..
  • దహన సంస్కారాలు చేస్తున్న ఇంకొందరు..
  • ఫ్రంట్‌ వారియర్లకు మద్దుతుగా నిలుస్తున్న మరికొందరు..
  • పల్లె నుంచి పట్నం దాకా తోచిన సాయం

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్నది. రోజురోజుకూ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. పక్కనున్న వ్యక్తి తుమ్మినా, దగ్గినా, చీదినా వెన్నులో వణుకుపుడుతున్న పరిస్థితి. వైరస్‌ బారిన పడిన వారిని కుటుంబ సభ్యులే దరి చేరనీయని దుస్థితి. ఇతంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కొందరు మానవతామూర్తులు తమ సేవానిరతిని చాటుతున్నారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా, కులమతాల పట్టింపులు లేకుండా బాసటగా నిలుస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు భరోసానిస్తున్నారు. పల్లె నుంచి పట్నం వరకు తోచిన సాయం చేస్తూ అండగా నిలుస్తూ సహృదయతను చాటుకుంటున్నారు. బతుకుపై ఆశ కల్పిస్తూ మేమున్నామంటూ స్నేహ హస్తాన్ని అందిస్తున్నారు.

కులమతాలకతీతంగా..

  • కరోనా వేళ కులమతాలకు పట్టింపుల్లేకుండా పోయాయి.
  • మానవతా పరిమళాలు వికసిస్తున్నాయి.
  • కొవిడ్‌తో మృతి చెందిన వారికి వద్దకు బంధువులు, ఆత్మీయులు రాకున్నా కొందరు ముస్లిం యువత ముందుకొచ్చి దహన సంస్కారాలు నిర్వహిస్తుండటం అభినందనీయం.
  • అంతేకాక వైద్యశాలల నుంచి శ్మశాన వాటికలకు తరలించడం.. వారి ఆచారాల మేరకు అంత్యక్రియలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఫ్రంట్‌ వారియర్లకు బాసటగా..

కరోనా వైరస్‌ బారిన పడిన వారికే గాకుండా వారికి అవిశ్రాంతంగా సేవలు అందిస్తున్న ఫ్రంట్‌ వారియైర్లెన శానిటేషన్‌, వైద్య, పోలీసు సిబ్బందికి సైతం మానవతా హృదయులు బాసటగా నిలుస్తున్నారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు మాస్క్‌లు, శానిటైజర్లు అందిస్తూ అండగా నిలుస్తున్నారు. మరికొందరు పండ్ల రసాలు, ఉచితంగా భోజనాన్ని అందిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన అనుకొంది దుర్గా భవానీకి పక్షవాతం వచ్చి రెండు కాళ్లు చచ్చుబడిపోయి, మాట కూడా సరిగా రాదు. భిక్షాటనతో కాలం వెళ్లదీస్తున్నది. అయినా పెద్ద మనసుతో భిక్షాటన, ప్రభుత్వం నుంచి అందుతున్న ఆసరా పింఛన్‌తో పోలీసులు, వైద్య సిబ్బందికి అరటిపండ్లు, మజ్జిగ పంపిణీ చేస్తున్నది. మానవీయతకు నిదర్శనంగా నిలుస్తున్నది.

ఎవరైనా తినొచ్చు.. ఇంటికీ తీసుకెళ్లవచ్చు..

హైదరాబాద్‌ షేక్‌పేట్‌ సూర్యానగర్‌కు చెందిన మహ్మద్‌ ఆసిఫ్‌ హుసేన్‌ సోహైల్‌ తన కుమార్తె ‘సఖినా’ పేరిట చారిటబుల్‌ ట్రస్ట్‌ను నెలకొల్పి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఆ సేవలను మరింతగా విస్తరించాడు. ఇంటివద్దే అన్నం, కూరలు వండి ప్రతిరోజు నిత్యం వందలాది మందికి అన్నదానం చేస్తున్నాడు. అంతేకాదు అక్కడి వరకు రాలేని నిస్సాహాయులు, పేదలకు ఇంటి వద్దకే భోజన ప్యాకెట్లను పంపిస్తూ సహృదయాన్ని చాటుకుంటున్నాడు. అంతేకాదు సెకండ్‌ వేవ్‌ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 13 వేల మందికి ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్లను అందిస్తున్నాడు. అంబులెన్స్‌లను సమకూర్చి కొవిడ్‌ బాధితులను వైద్యశాలలకు తరలిస్తున్నాడు. అంతేకాదు ఎవరైనా కొవిడ్‌తో మరణిస్తే కులమతాల పట్టింపు లేకుండా వారి అంత్యక్రియలను ట్రస్ట్‌ ద్వారా నిర్వర్తిస్తూ మానవీయతను చాటుకుంటున్నాడు. కేవలం హైదరాబాద్‌లోని వారికే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ బాధితులకు బాసటగా నిలుస్తున్నాడు.

అవగాహన కార్యక్రమాలు..

కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు ముఖ్యంగా యువకులు తమవంతుగా కృషి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల బృందాలుగా ఏర్పడి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గ్రామీణులను చైతన్యవంతం చేస్తున్నారు. మాస్క్‌ల వాడకం, సామాజిక దూరం పాటించడం తదితర అంశాలను వారికి అర్థమయ్యేలా వివరిస్తున్నారు. అంతేకాక ఉచితంగా మాస్క్‌లు, శానిటైజర్లను పంపిణీ చేస్తున్నారు. స్థానిక అధికారులతో కలిసి వైరస్‌ నివారణకు తోడ్పాటునందిస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల యువకులు కొవిడ్‌ బాధితులకు ఆర్థికంగా చేయూతనందిస్తున్నారు. ఉచితంగా భోజనం, మెడికల్‌ కిట్లను అందిస్తున్నారు. మరికొంత మంది విరాళాలను సేకరిస్తూ వాటితో పేదలకు నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు. ఇక మరికొంత మందైతే ప్రాణాలను పణంగా పెట్టి మరీ సేవలను అందిస్తున్నారు. ఆక్సిజన్‌ను ఉచితంగా అందజేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సహృదయులు.. ఆదర్శ సేవలు

ట్రెండింగ్‌

Advertisement