మలక్‌పేట: మూసీ సుందరీకరణ కోసమని రివర్ బెడ్లోని ఇండ్లను కూల్చివేసి నిర్వాసితులను వేర్వేరు ప్రాంతాలకు తరలించిన ప్రభుత్వం.. రివర్ బెడ్‌కు గోడను నిర్మించలేదు. దీంతో పరీవాహక కాలనీలోని ఇండ్లలోకి పాములు, తేళ్లు, జెర్రీలు, కప్పలు దూరుతున్నాయి. రివర్ బెడ్ పొడవునా గోడను నిర్మించాలని ప్రభుత్వం నిధులు కేటాయించి.. ఆ పనులను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. అయితే సదరు కాంట్రాక్టర్ నిధులు బొక్కేసి గోడను నిర్మించకపోగా, ప్లాస్టిక్ మెష్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నాడు.
కొన్నాళ్లకే మెష్ పాడైపోవడంతో పరీవాహక ప్రాంత ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. శనివారం చాదర్‌ఘాట్ మూసానగర్ రసూల్‌పురా బస్తీల్లోని ఓ ఇంట్లోకి నాగుపాము పిల్లలు దూరటంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు పాములను పట్టే వ్యక్తులను పిలవ్వడంతో వారొచ్చి.. పాము పిల్లలను పాస్టిక్ డబ్బాలో బంధించి తీసుకెళ్లారు. ప్రతిరోజూ పాములు, తేళ్లు, జెర్రీలు దూరుతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.