46 మందికి ఆరోగ్య కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు
వేగంగా సమాచార సేకరణ..
అత్యవసర మందులు అందించేందుకు ఉపయుక్తం
ఎన్సీడీ, వీహెచ్ఆర్ యాప్లతో సేవలు
కందుకూరు, ఫిబ్రవరి 25: ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్య శాఖ డిజిటల్ సేవలను మరింత విస్తరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాగిత రహిత సేవల కోసం పలు ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటికే ఆరోగ్య శాఖ ఆన్లైన్ సేవలను ప్రారంభించింది. ప్రజల గుమ్మాల వద్దకు వెళ్లే ఆరోగ్య కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను కూడా పంపిణీ చేస్తున్నది. ఇకపై ప్రజలకు అందించే సేవల వివరాలతో పాటు పలు రకాల ఆరోగ్య సర్వేలు, అందించిన సేవలు, వ్యాధుల వివరాలు, అవగాహన కార్యక్రమాలు తదితర ఆరోగ్య సమాచారాన్ని నేరుగా సెల్ఫోన్ల ద్వారా ప్రధాన కార్యాలయాలకు చేరవేయనున్నారు. ఫలితంగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం అత్యవసర వైద్య సేవలు అందించే వీలుంటుందని వైద్యాధికారులు చెబుతున్నారు. మండల పరిధిలోని కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రి పరిధిలోని 23, రాచులూరు ప్రభుత్వ ఆస్పత్రి పరిధిలో 23… మొత్తం 46 మంది ఆశ వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారు. వీరు ప్రతి రోజూ ప్రజలకు వైద్య సేవలందించడంలో కీలకపాత్ర పోషిస్తారు.
ఇంటింటికీ వెళ్లి వివరాలను..
మండలం పరిధిలోని రెండు ప్రభుత్వ ఆస్పత్రుల పరిధిలో పనిచేస్తున్న 46 మంది ఆశ వర్కర్లుకు స్మార్ట్ ఫోన్లు అందజేస్తాం. దీంతో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వైద్య సేవలను అందిస్తారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం అత్యవసరంగా మందుల వంటి సేవలందించేందుకు వీలుంటుంది.
– డాక్టర్ రాధిక, కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రి
ఆశ వర్కర్లను ఆదుకుంటున్న ప్రభుత్వం
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆశ వర్కర్లను అన్ని విధాలుగా ఆదుకుంటున్నది. కాగిత రహిత సేవల కోసం స్మార్ట్ ఫోన్లను అందించడం సంతోషకరం. తమను అన్ని విధాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు
– చీమల అనిత, ఆశ వర్కర్, కొత్తగూడ