Hyderabad | బేగంపేట్, ఏప్రిల్ 18 : తెలంగాణ ప్రభుత్వం ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించి వాహనాలు, పాదాచారుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సాధ్యమైనంత వరకు ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వారిని జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆక్రమణలను తొలగిస్తూ వస్తున్నారు. కొంత కాలం నుంచి ఈ స్పెషల్ డ్రైవ్‌ను చేపడుతూ ఆక్రమణలను తొలగించి వాహనాల రాకపోకలకు, పాదాచారులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. కానీ కొంతమంది అక్రమార్కులు అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ మమ్మల్ని ఏవరేం చేస్తారు అన్న చందంగా తిరిగి ఫుట్ పాత్లను ఆక్రమించి తిరిగి ఇబ్బందులను సృష్టిస్తున్నారు. ట్రాఫిక్ అధికారులు అలాంటి వారిని గుర్తించి ఫుట్ పాత్లను ఆక్రమించిన వారిని తొలగించాలని కోరుతున్నారు.
మీరు తొలగిస్తే మేం పెడతాం..
వ్యాపారాలను మీరు తొలగిస్తే మేం పెడతాం అన్న చందంగా తయారైంది లష్కర్‌లోని ఫుట్‌పాత్ వ్యాపారుల తీరు. వాణిజ్య వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతున్న లష్కర్లో ప్రధాన, అంతర్గత రహదారుల్లో ఉన్న ఫుట్ పాత్లను అక్రమార్కులు పూర్తిగా ఆక్రమించారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడతుంది. పాదాచారుల నడక కోసం నిర్మించిన ఫుట్‌పాత్‌ను కూడా వ్యాపారులు ఆక్రమించుకోవడంతో సమస్య మరింత జఠిలంగా మారుతుంది. అసలే ఇరుకుగా ఉన్న అంతర్గత రహదారులు ఆపైన వ్యాపారులు రోడ్లను కబ్జా చేసి తమ ఉత్పత్తులను, సరుకులను పెట్టుకుంటుండటంతో వాహనాలు రాకపోకలు సాగించలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ రహదారుల్లో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయామంటే కనీసం అరగంట సమయం వృధా కావాల్సిందే. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ అధికారులు ముందు జాగ్రత్తగా విధులు నిర్వహిస్తుంటారు. కానీ అంతర్గత రహదారులకు వచ్చేసరికి ట్రాఫిక్ సిబ్బంది ఎవరు అందుబాటులో ఉండటం లేదు. దీంతో ప్రతిరోజు వినియోగదారులు ట్రాఫిక్ ఇబ్బందులతో బెంబేలెత్తిపోతున్నారు.
ప్రధానంగా సికింద్రాబాద్ జనరల్ బజార్, మోండా మార్కెట్, మహాంకాళి స్ట్రీట్, టోబాకో బజార్, సామ్ముల బజార్, రంగ్రేజీ బజార్, జగన్నాథ స్వామి దేవాలయం, పీజీ రోడ్డు, మినిస్టర్ రోడ్డు, ఎస్పి రోడ్డు, మహాత్మాగాంధీ రోడ్డు, రాష్ట్రపతి రోడ్డు, ప్యారడైజ్, స్టేషన్ రోడ్డు, రాణిగంజ్ తదితర ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ జామ్‌లు తీవ్రమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని బంగారు ఆభరణాల తయారీ షాపులు, టెక్స్‌టైల్‌కు సంబంధించి హోల్‌సేల్, రిటైల్ దుకాణాలు, జ్యువెలరీ, ప్యాన్సీ దుకాణాలు అధికంగా ఉన్నాయి. దీంతో నిత్యం వేలాది మంది ఈ ప్రాంతాలలో సంచరిస్తుంటారు. ఎంజీ రోడ్డు నుండి ఆర్.పి. రోడ్డు, రాణిగంజ్ నుండి పార్కీన్ ప్రాంతాల నుండి అధికంగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. మహాత్మా గాంధీ రోడ్డు, ఆర్.పి రోడ్డుల మధ్య ఈ బజారు ఉండటంతో వినియోగదారులు కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ రోడ్ల మధ్యలోనే అంతర్గత రహదారులు రోడ్లు మరి చిన్నవిగా ఉంటాయి.
దీనికి తోడు వ్యాపారులు సైతం తమ ఉత్పత్తులను రోడ్లపైకి తీసుకువచ్చి పెడుతుండటం, వాటి అనుకుని వాహనాలను పార్కింగ్ చేయడంతో పూర్తిగా రోడ్లు కుచించుకుపోతున్నాయి. దీంతో వాహనాలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంబంధిత అధికారులు ఈ ప్రాంతాలలో అక్రమ పార్కింగ్ లను, వ్యాపారులు రోడ్లపై పెట్టే ఉత్పత్తులను, ఫుట్‌పాత్ ఆక్రమణలు లేకుండా నివారిస్తే ఈ ట్రాఫిక్ జామ్స్ నుండి బయటపడే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు వీటిపై దృష్టి సారించాలని వినియోగదారులు కోరుతున్నారు.