‘వారం రోజులుగా నీళ్లు రాకుంటే ఎలా బతకాలి..’ ‘ఓట్ల కోసం వచ్చినప్పడు వంగివంగి దండాలు పెట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎక్కడకు పోయారు..’ ‘కేసీఆర్ ఉన్నప్పుడు ఏరోజూ ఇలాంటి పరిస్థితి లేదు..’ ‘రేవంత్‌రెడ్డికి ఓ దండం..’ అంటూ మహిళలు ఆగ్రహంతో ప్రశ్నించారు. ‘మాకు ఇవ్వడానికి నీళ్లు లేవు కానీ.. ట్యాంకర్ల ద్వారా నీళ్లను అమ్ముకుంటున్నారంటూ..’ తట్టిఖానా సెక్షన్ జలమండలి రిజర్వాయర్ వద్ద ట్యాంకర్లను బస్తీవాసులు అడ్డుకున్నారు.
బంజారాహిల్స్, ఏప్రిల్ 24 : మా బస్తీకి నీళ్లు ఇచ్చేదాకా ట్యాంకర్లను కదలనిచ్చేది లేదంటూ.. రెండుగంటల పాటు అక్కడే బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని నందినగర్ బస్తీలోని బీరప్ప గల్లీ, కేఎల్ టవర్ వెనకాల బస్తీ, వడ్డెర బస్తీ, స్టడీ సర్కిల్ వెనకాల బస్తీ తదితర ప్రాంతాల్లో పదిరోజులుగా మంచినీరు సరిగా రావడం లేదు. పలు ప్రాంతాల్లో పైపులైన్లు బ్లాక్ కావడం, వాల్వ్ సమస్యలు ఉన్నాయంటూ రెండునెలలుగా కాలయాపన చేస్తున్న జలమండలి అధికారుల తీరుపై ఆగ్రహంతో ఉన్న ఆయా బస్తీలకు చెందిన స్థానికులు శుక్రవారం ఉదయం 8 గంటలకు పెద్ద సంఖ్యలో తట్టిఖానా సెక్షన్ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు.
తమ బస్తీలకు నీళ్లు ఇవ్వాలని అక్కడి అధికారులను కోరగా, పైప్‌లైన్ మరమ్మతులు చేస్తున్నామని, రాత్రిలోగా నీటి సరఫరా ఇస్తామని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే పదిరోజుల కిందట నుంచి ఇదే విధంగా సాకులు చెబుతున్నారని, నీళ్లు ఇచ్చేదాకా ఇక్కడినుంచి కదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. ట్యాంకర్లు బయటకు వెళ్లకుండా చెట్ల కొమ్మలను, రాళ్లను అడ్డుగా వేసి ఆందోళనకు దిగారు. బస్తీలో నీళ్లు ఇవ్వడం లేదు కానీ, డబ్బులకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు అమ్ముకుంటున్నారంటూ గొడవకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బస్తీవాసుల ఆందోళనపై సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని సముదాయించే ప్రయత్నం చేసినా స్థానికులు పట్టువీడలేదు.
బస్తీవాసుల ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు..
నందినగర్‌లోని పలు ప్రాంతాల్లో నీటి సమస్యలతో జలమండలి రిజర్వాయర్‌ను ముట్టడించిన విషయాన్ని తెలుసుకున్న ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరుకుని వారి అందోళనకు మద్దతు పలికారు. బస్తీవాసులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. జలమండలి ఈడీ అశోక్ సామ్రాట్, సీజీఎం ప్రభు, సెక్షన్ మేనేజర్ శివకుమార్‌లకు ఫోన్ చేసి మాట్లాడారు. నీటి సమస్యలు పరిష్కరిస్తేనే ఆందోళన విరమిస్తామని హెచ్చరించారు. దీంతో అక్కడకు చేరుకున్న జలమండలి అధికారులు అశోక్ సామ్రాట్, సీజీఎం ప్రభు తదితరులు సమస్యను సాయంత్రం లోగా పరిష్కరించి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. తక్షణ పరిష్కారంగా సుమారు 15 వాటర్ ట్యాంకర్ల ద్వారా నందినగర్ బస్తీలో సమస్యలు ఉన్న ప్రాంతాల్లో నీటిని పంపించడంతో బీఆర్ఎస్ నేతలతో పాటు బస్తీవాసులు తమ ఆందోళనను విరమించారు.